న్యూఢిల్లీ: విమానాలు నడిపే పైలట్లకు, ఇతర సిబ్బందికి డ్రగ్ పరీక్షలు నిర్వహించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రతిపాదించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. నియమ నిబంధలన్నీ అమల్లోకి వస్తే విమానంలో పనిచేసే సిబ్బందితోపాటు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకూ ఈ పరీక్షలు నిర్వహిస్తామని వారు చెప్పారు. తొలిదశలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల్లో ఈ పరీక్షలను చేపడతారు. రెండు దశల్లో జరిగే ఈ పరీక్షలో ఒకటి విమానాశ్రయం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కాంప్లెక్స్‌లలో జరుగుతుంది.
ఈ స్క్రీనింగ్ టెస్ట్‌ను వీడియోలో రికార్డు చేస్తారు. గంజాయి, ఓపియం తదితర మత్తుమందులు తీసుకున్నట్లు స్క్రీనింగ్ టెస్ట్‌లో బయటపడితే, మళ్లీ నిర్ధారణకు ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. డీజీసీఏ అధికారుల నేతృత్వంలో ఏటా ఒక్కో సంస్థ సిబ్బందిలో పదిశాతం మందికి ఈ పరీక్షలు చేస్తారు. స్క్రీనింగ్ టెస్ట్‌లో మత్తుమందులు తీసుకున్నట్లు తెలిస్తే ఆ ఉద్యోగిని భద్రత వంటి కొన్నిరకాల విధుల నుంచి తప్పిస్తారు. తదుపరి పరీక్షల్లోనూ మత్తుమందులు తీసుకున్నట్లు రూఢి అయితే తగిన రీహాబిలిటేషన్ సెంటర్లకు పంపుతారు.
Comments
Please login to add a commentAdd a comment