
‘మినిమమ్ గవర్నమెంట్’ మాట మరిచారా మోదీ?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాను పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ‘మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెన్స్’ తన విధానమంటూ నినాదం ఇచ్చారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాను పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ‘మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెన్స్’ తన విధానమంటూ నినాదం ఇచ్చారు. అంటే అతి తక్కువ మంత్రులతో ఎక్కువ పరిపాలనను అందించడమే లక్ష్యమని చెప్పుకున్నారు కూడా. గత కొన్ని రోజులుగా తన మంత్రి వర్గాన్ని విస్తరిస్తానని చెబుతున్న ఆయన మంగళవారం నాడు తన మంత్రివర్గంలోకి ఏకంగా 19 మంది కొత్తవారిని కేబినెట్‌లోకి తీసుకున్నారు. దీంతో ఆయన మంత్రివర్గంలో మొత్తం సభ్యుల సంఖ్య 78కి చేరింది.
మంది ఎక్కువై మజ్జిగ పలసనైనట్లు మంత్రులు, మంత్రివర్గ బృందాలు ఎక్కువైతే ప్రభుత్వ పాలనలో ఆటంకాలు పెరుగుతాయని ఆయన భావించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరితగతిన సేవలను అందించడమే తన మంత్రివర్గ లక్ష్యం అవుతుందని చాటుకున్నారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ పాలనలో కాలయాపనను నివారించేందుకు వివిధ మంత్రివర్గ బృందాలను, వివిధ మంత్రివర్గ కమిటీలను రద్దు చేశారు.
అయితే.. తర్వాత తక్కువ మంది మంత్రులతో ఎక్కువ పని రాబట్టడం కష్టమని భావించారో, ఏమో గానీ తన మంత్రివర‍్గంలో సభ్యుల సంఖ్యను మంగళవారం నాడు 78కి పెంచుకున్నారు. యూపీఏ 77 మంది మంత్రులను నియమిస్తే తన మంత్రివర్గం అంతకంటే ఒకటి ఎక్కువనే చెప్పారు. గతంలో యూపీఏ ప్రభుత్వం తన భాగస్వామ్య పక్షాలను మెప్పించడం కోసమే 77 మందిని చేర్చుకోవాల్సి వచ్చింది.
కానీ మోదీ మాత్రం రానున్న అసెంబ్లీ రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ‘మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెన్స్’ నినాదంతో రాజీ పడ్డారన్నది నిర్వివాదాంశం. అందులోనూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ ప్రాతినిధ్యం లభించడం కూడా గమనార్హం. ఆ రాష్ట్రంలో వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న విషయం తెల్సిందే.