గత నెలలో కాంగ్రెస్‌ను వీడిన శంకర్‌సిన్హ్ వాఘేలా యూటర్న్ తీసుకున్నారు.
అహ్మదాబాద్: గత నెలలో కాంగ్రెస్‌ను వీడిన శంకర్‌సిన్హ్ వాఘేలా యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అహ్మద్ పటేల్‌కు ఓటు వేయలేదని తెగేసి చెప్పారు. ఓడిపోయే అభ్యర్థికి ఓటు ఎవరు వేస్తారని ఆయన ప్రశ్నించడంతో కాంగ్రెస్‌లో కలవరం మొదలైంది. కాంగ్రెస్ నుంచి అయిదో సారి రాజ్యసభలో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరిన అహ్మద్ పటేల్ విజయం సాధించడం అనుమానమేనని వాఘేలా అన్నారు. మంగళవారం రాజ్యసభ ఎన్నికల పోలింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కాంగ్రెస్ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు సైతం ఆయనకు ఓటు వేయరని, అహ్మద్ పటేల్‌కు 40 మించి ఓట్లు రావని జోస్యం చెప్పారు.
గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ 57 మంది ఎమ్మెల్యేలుండగా, ఇటీవలే ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్ బలం 51కి పడిపోయింది. వాఘేలా వర్గానికి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలూ కాంగ్రెస్‌కు దూరంగా ఉన్నారు. ఇక 44 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో ఉండగా, అహ్మద్ పటేల్ విజయం సాధించాలంటే మరో ఎమ్మెల్యే మద్దతు ఆ పార్టీకి అవసరం. అయితే ఇద్దరు సభ్యులున్న ఎన్‌సీపీ మద్దతుపై పటేల్ ఆశలు పెట్టుకున్నారు.