సీఎం వెంట రాగా.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా
అహ్మదాబాద్: కాంగ్రెస్ బహిష్కృత నేత, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సిన్హ్ వాఘేలా(77) తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సమయంలో బీజేపీలోకి చేరనున్నారన్న వార్తలను కొట్టిపారేసిన వాఘేలా.. బుధవారం గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్‌రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ ఇతర బీజేపీ నేతలు తోడురాగా తన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ రమణ్‌లాల్ వోరేకు అందజేశారు.
తన నియోజకవర్గ ప్రజలను సంప్రదించిన తర్వాతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు వాఘేలా చెప్పారు. జూలై 21న తన 77వ జన్మదినం సందర్భంగా.. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు ఆయన ప్రకటన చేశారు. ఈ నెల 8న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు.