సాక్షి, చెన్నై: చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ గెలుపుపై నటుడు కమల్‌హాసన్ చేసిన విమర్శలు ఆయనను వివాదాల్లోకి నెట్టాయి. దినకరన్ అభిమానులు ఆగ్రహంతో కమల్ దిష్టిబొమ్మను దహనం చేయగా, మరో అభిమాని కోర్టులో పిటిషన్ వేయడంతో వివాదం మరింత ముదిరింది.
గత నెల 21వ తేదీన హోరాహోరీగా సాగిన ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన దినకరన్ భారీ మెజార్టీతో గెలుపొందారు. అన్నాడీఎంకే అభ్యర్థి మినహా అందరూ డిపాజిట్ కోల్పోయారు. ఈ నేపథ్యంలో రెండురోజుల క్రితం కమల్ మీడియా వద్ద తీవ్రమైన విమర్శలు చేశారు. ఆర్కేనగర్ ఓటర్లు ఓటుకు రూ. 20వేలు పుచ్చుకునేందుకు ఒక దొంగ వద్ద బిక్షమెత్తుకున్నారని దుయ్యబట్టారు. కమల్ చేసిన ఈ విమర్శలు దినకరన్ అనుచరుల్లో ఆగ్రహాన్ని తెప్పించాయి. పెద్ద సంఖ్యలో దినకరన్ అనుచరులు చెన్నై పూందమల్లి గుమన్‌చావడి జంక్షన్‌లో శుక్రవారం ఉదయం కమల్ దిష్టిబొమ్మను, ఫొటోలను సైతం తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. కమల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు దినకరన్ అనుచరులు చెన్నై ఎల్డామ్స్‌రోడ్డులోని ఇంటిని ముట్టడించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో కమల్ ఇంటి ముందు పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
కమల్‌పై కోర్టులో పిటిషన్
చెన్నై ఆర్కేనగర్ ప్రజలను, ఓటర్లను అవమానించే విధంగా నటుడు కమల్‌హాసన్ తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు చేశాడని ఆరోపిస్తూ కోయంబత్తూరు గణపతి మణియక్కరాణ్ పాళంకు చెందిన దినకరన్ అనుచరుడు ఇళంగోవన్ కోయంబత్తూరు మేజిస్ట్రేటు కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషన్ వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ 80వేలకు పైగా ఓట్లు పొంది 40 వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందాడు. ఈ గెలుపుతో దినకరన్‌కు ప్రజల్లో పేరు ప్రతిష్టలు పెరిగాయి. అయితే ఆర్కేనగర్ ప్రజలు ఓటుకు రూ.20వేలు పొందడం ద్వారా దొంగ వద్ద బిక్షమెత్తుకున్నారని నటుడు కమల్‌హాసన్ విమర్శించారు. కమల్ చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తలను, ఓటర్లను కళంకితులను చేసేలా ఉన్నాయి.
కమల్ వ్యాఖ్యలతో సమాజంలో నేను హేళనకు గురై తీవ్ర మనోవేదన చెందుతున్నాను. ఈ కారణంగా కమల్‌హాసన్‌పై కఠిన చర్య తీసుకోవాలని పిటిషన్‌లో కోరాడు. ఈ పిటిషన్‌ను ఈనెల 12వ తేదీన విచారణకు స్వీకరిస్తామని మేజిస్ట్రేట్ రాజ్‌కుమార్ శుక్రవారం తెలిపారు. అన్నాడీఎంకే (అమ్మ) కర్ణాటక శాఖ కార్యదర్శి పుహళేంది శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆర్కేనగర్ ప్రజలను బిక్షగాళ్లని కమల్ నీచమైన వ్యాఖ్యలు చేశాడని అన్నారు. కమల్ నిద్రిస్తున్న సమయంలో రజనీకాంత్ రాజకీయ ప్రకటన చేయడంతో ఉలికిపాటుకు గురికావడం వల్లనే కమల్ నోటి నుంచి ఇలాంటి విమర్శలు వెలువడ్డాయని ఆయన ఎద్దేవా చేశారు. కమల్ రాజకీయాల్లోకి దిగితే కనీసం ఐదుశాతం ఓట్లను కూడా పొందలేరని అన్నారు. దినకరన్ అనుమతితో కమల్‌పై పోరాటం చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment