
జీఎస్‌టీపై విందు భేటీ
ఇంకా తొలగని ప్రతిష్టంభన...
కాంగ్రెస్ నేతలు ఆజాద్, శర్మలతో జైట్లీ, వెంకయ్య చర్చలు
వెంకయ్య కార్యాలయంలో ప్రతిపక్ష నేతలకు ఆంధ్రా విందు
♦ ఖర్గే లేనందున మళ్లీ చర్చిద్దామన్న కాంగ్రెస్.. సరేనన్న సర్కారు
♦ తమ హయాంలో జీఎస్‌టీ బిల్లు మోదీ వల్లే ఆగిందని కాంగ్రెస్ ధ్వజం
సాక్షి, న్యూఢిల్లీ: వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ) బిల్లుపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ప్రతిష్టంభన ఇంకా తొలగిపోలేదు. పార్లమెంటు ప్రస్తుత శీతాకాల సమావేశాలు ఈ నెల 23తో ముగియనున్నాయి. మంగళవారం నుంచి కేవలం ఆరు రోజుల సమయమే ఉండటంతో.. ఈ భేటీల్లో జీఎస్‌టీ బిల్లు ఆమోదం పొందే అవకాశాలు తగ్గిపోతున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ భేటీల్లో బిల్లు ఆమోదం పొందితే.. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి జీఎస్‌టీ అమలుకు అవకాశం ఏర్పడుతుంది. రాజ్యసభ సమావేశాలు కాంగ్రెస్ ఆందోళనతతో సక్రమంగా కొనసాగకపోతుండటంతో.. జీఎస్‌టీ సహా పలు చట్టాలను ప్రభుత్వం ముందుకు తేలేకపోతోంది.
ఈ పరిస్థితుల్లో బిల్లుపై ఉన్న విభేదాలను పరిష్కరించుకునే నిమిత్తం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడులు సోమవారం కాం గ్రెస్ నేతలతో సమావేశమై చర్చలు జరిపారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీఆజాద్, ఉప నేత ఆనంద్‌శర్మలతో పార్లమెంటు ఆవరణలోని వెంకయ్య కార్యాలయంలో విందు భేటీ నిర్వహించారు. ఆంధ్రా వంటలు వడ్డించిన ఈ భేటీలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, కాంగ్రెస్ చీఫ్ విప్ జ్యోతిరాదిత్య సిధియాలు కూడా తరువాత వచ్చి చేరారు. జీఎస్‌టీ బిల్లుపై ఇరుపక్షాల మధ్య ఉన్న విభేదాలు, పరిష్కారాలపై చర్చించారు.
అయితే.. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ఢిల్లీలో లేనందున.. మళ్లీ సమావేశమై చర్చిద్దామని ఆ పార్టీ నేతలు ప్రతిపాదించటంతో ప్రభుత్వం అంగీకరించింది. మరోవైపు.. ప్రభుత్వం-ప్రతిపక్షాల మధ్య చర్చలు కేవలం ఒక అంశానికే పరిమితం చేయరాదని కాంగ్రెస్ స్పష్టంచేసింది. జీఎస్‌టీ బిల్లుపై ఇంతకుముందు ప్రధాని నరేంద్రమోదీ.. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌లను తేనీటి విందుకు ఆహ్వానించి చర్చించడం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ నేతలతో ప్రభుత్వ పెద్దలు చర్చలు జరిపినప్పటికీ.. ఇరు పక్షాల మధ్యా ఘర్షణ వైఖరి ఏమాత్రం తగ్గలేదని ఈ భేటీ అనంతరం ఆనంద్‌శర్మ, జైట్లీలు చేసిన వ్యాఖ్యలు స్పష్టంచేస్తున్నాయి.
ఒక్క బిల్లుకే పరిమితం చేయొద్దు: కాంగ్రెస్
ఈ చర్చల్లో ఫలితమేదీ రాలేదని.. దీనిపై కసరత్తు కొనసాగుతోందని కాంగ్రెస్ నేత ఆనంద్‌శర్మ భేటీ అనంతరం మీడియాతో పేర్కొన్నారు. ‘ఏడాదిన్నర పాటు ప్రతిపక్షంతో మాట్లాడని ప్రభుత్వం.. ఇప్పుడు కేవలం ఒకే ఒక్క బిల్లుపై మాతో చర్చలు జరపాలని తహతహలాడుతోంది. ముందు.. వాళ్లు (ప్రభుత్వం) ఒకే బిల్లు విషయమై అతిగా పట్టించుకోరాదు.. రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న అన్ని బిల్లులూ ముఖ్యమైనవే’ అని అన్నారు. నాడు గుజరాత్ సీఎంగాగా ఉన్న మోదీ వ్యతిరేకించటం వల్లనే యూపీఏ-2 హయాంలో ఐదేళ్లపాటూ జీఎస్‌టీ బిల్లును అమలులోకి తేలేకపోయామని విమర్శించారు.
ఇవీ తుడిచిపెట్టుకుపోతాయేమో: జైట్లీ
‘పార్లమెంటు గత సమావేశాలు జరగలేదు. ప్రస్తుత సమావేశాలు కూడా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదముంది. ఇందుకు కారణాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి’ అని జైట్లీ ప్రతిపక్ష నేతలతో భేటీ అనంతరం తన ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. తొలి లోక్‌సభ చివరి రోజైన 1957 మార్చి 28న పండిట్ జవహర్‌లాల్‌నెహ్రూ చేసిన ప్రసంగాన్ని మనమందరం తప్పక చదవాలంటూ.. ‘ఈ దేశంలో నివసించే అసంఖ్యాక మానవుల భవిష్యత్తుకు బాధ్యతవహించే ఈ సార్వభౌమాధికార సంస్థలో సభ్యులుగా ఉండటం కన్నా మరింత ఉన్నతమైన బాధ్యత, గొప్ప విశేషాధికారం మరేదీ ఉండబోదు. ఈ ఐదేళ్లూ మనం చరిత్ర అంచునే కాదు.. కొన్నిసార్లు చరిత్ర సృష్టించే ప్రక్రియల్లోనూ పనిచేశాం’ అన్న నెహ్రూ వ్యాఖ్యలను ప్రస్తావించారు. నెహ్రూ వారసులమని చెప్పుకునే వారు.. తాము ఎటువంటి చరిత్రను లిఖిస్తున్నారన్న ప్రశ్న వేసుకోవాలని కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతలతో మంగళవారం తిరిగి సమావేశం కొనసాగుతుందని వెంకయ్య చెప్పారు.