
న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్ కేసులో కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కు బెయిల్ లభించింది. ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ. 25 లక్షల పూచీకత్తు సమర్పించాలని, దేశం విడిచి వెళ్లరాదని ఉన్నత న్యాయస్థానం షరతులు విధించింది. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించరాదని హెచ్చరించింది. దర్యాప్తు సంస్థలకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయరాదని ఆదేశించింది. తిహార్‌లో జైలులో ఉన్న శివకుమార్‌ను నేడు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కలిశారు. అన్నివిధాల అండగా ఉంటామని ఆయనకు భోరోసాయిచ్చారు. కోట్లాది రూపాయల పన్నులు ఎగవేశారన్న ఆరోపణలతో 57 ఏళ్ల శివకుమార్‌ను సెప్టెంబర్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు.
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన చిదంబరం
ఐఎన్‌ఎక్స్ మీడియాలో కేసులో బెయిల్ కోసం కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ఆరోగ్యం క్షీణిస్తున్నందున బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును అభ్యర్థించారు. చిదంబరం బెయిల్ పిటిషన్‌పై రేపు విచారించే అవకాశముంది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఇదే కేసులో ఆయనకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ ఇచ్చింది. ఈడీ కస్టడీలో ఉండటంతో ఆయన జైలు నుంచి విడుదల కాలేదు. ప్రత్యేక కోర్టు ఆయనకు విధించిన ఈడీ కస్టడీ గడువు రేపటి వరకు ఉంది. (చదవండి: బెయిలు.. అయినా తప్పదు జైలు)