
సాక్షి, చెన్నై: తమిళనాడులో డీఎంకే ఎమ్మెల్యే, సినీ నిర్మాత జే అన్బళగన్ కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది రోజులు వైరస్‌తో పోరాడిన ఆయన చెన్నైలోని డాక్టర్ రేలా ఇనిస్టిట్యూట్ అండ్ మెడికల్ సెంటర్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన తన పుట్టిన రోజునే ప్రాణాలు కోల్పోవడం విషాదం. 1958 జూన్ 10న జన్మించిన అన్బళగన్ 62వ ఏటిలోకి బుధవారం అడుగు పెట్టారు. అదే రోజు ఉదయం ఆయన మరణించారన్న వార్త కుటుంబసభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక ప్రజాప్రతినిధి కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోవడం దేశంలో ఇదే తొలిసారి. వరసగా మూడుసార్లు ఎమ్మెల్యే అయిన అన్బళగన్ సినిమా నిర్మాత, పంపిణీదారుడు, వాణిజ్యవేత్త కూడా. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ అన్బళగన్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.