నేను ఇంకా బతికేఉన్నాను: మహిళా సీఎం
లాల్ గఢ్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మరింత జోరందుకోనున్నాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు భయపడేది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. తాను ఇంకా బతికే ఉన్నానని, తాను ఉన్నంత వరకూ పోరాడుతూనే ఉంటానని ప్రజలకు అండగా ఉంటానని వ్యాఖ్యానించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు హుషారుగా ఎన్నికల్లో ముందుకెళ్లాని, ప్రజల మద్ధతు తమ పార్టీకి ఎప్పుడూ ఉంటుందున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు.
ఇతర రాష్ట్రాల నుంచి ఎవరో వస్తారని భయపడాల్సిన అవసరం లేదని, వారు కేవలం మూడు రోజుల్లోనే తోకముడుస్తారని మమత పేర్కొన్నారు. గతంలో మావోయిస్టు ప్రాబల్యం అధికంగా ఉండే జంగల్ మహల్ ఏరియాలో ప్రచార కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలను ఉత్సాహపరిచారు. వారిలో మానసిక స్థైర్యాన్ని పెంచారు. తృణముల్ కాంగ్రెస్ అంటేనే తల ఎత్తుకునేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. బీజేపీ పార్టీ, కాంగ్రెస్ తో కలిసి సీపీఐ(ఎం) పార్టీ చేసే దుష్ప్రచారానికి వెనక్కి తగ్గరాదని, వారికి తమను ఓడించే సామర్థ్యం లేదని చురకలు అంటించారు. కేవలం నాలుగేళ్లలోనే 400 ఏళ్ల పనులు నిర్వహించామని సీఎం మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు.