
‘అణు బాధ్యత’ను సవరించేది లేదు
పౌర అణు సహకార ఒప్పందం అమలు కోసం.. అణు ప్రమాదానికి పౌర బాధ్యత (సీఎల్‌ఎన్‌డీ) చట్టం లేదా నిబంధనలను సవరించే...
- అమెరికాతో అవగాహనపై కేంద్ర ప్రభుత్వం వివరణ
- సరఫరాదారులపై బాధితులు కేసు వేయడం కుదరదు
న్యూఢిల్లీ: పౌర అణు సహకార ఒప్పందం అమలు కోసం.. అణు ప్రమాదానికి పౌర బాధ్యత (సీఎల్‌ఎన్‌డీ) చట్టం లేదా నిబంధనలను సవరించే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అణు విద్యుత్ ప్లాంటు వద్ద ఏదైనా అణు ప్రమాదం సంభవించిన పక్షంలో.. సంబంధిత అణు పరికరాలను సరఫరా చేసిన విదేశీ సంస్థలపై బాధితులు కేసు వేయకుండా ఉండేందుకు ఇటీవల అమెరికాతో కుదుర్చుకున్న అవగాహనపై విదే శాంగ శాఖ ఆదివారం ఒక వివరణాత్మ పత్రాన్ని విడుదల చేసింది.
ప్రమాదానికి బాధ్యత, పరిహారం వంటి వివాదాస్పద అంశాలతో సహా ‘తరచుగా అడుగుతున్న ప్రశ్నలు’ అనే పేరుతో ఈ పత్రాన్ని విడుదల చేసింది. ప్రమాదం జరిగినపుడు సంబంధిత రియాక్టర్లను సరఫరా చేసిన విదేశీ సంస్థలపై పరిహారం కోరుతూ బాధితులు కేసు వేయడానికి వీలు ఉండదని, అయితే వనరుల హక్కు ఉన్న సదరు అణు విద్యుత్ కేంద్ర నిర్వాహక సంస్థ ఇటువంటి కేసు వేసేందుకు వీలు ఉంటుందని పేర్కొంది.
అణు ఒప్పంద అమలుకున్న అవరోధాలను అధిగమించేందుకు.. భారత్-అమెరికా అణు సంబంధ బృందాల మధ్య జరిగిన చర్చల్లో ఈ అవగాహనకు వచ్చినట్లు వివరించింది. అమెరికా అధ్యక్షుడు ఒబామా జనవరి 25న భారత పర్యటనకు వచ్చే మూడు రోజుల ముందు.. బ్రిటన్‌లోని లండన్‌లో ఈ బృందం సమావేశమై చర్చించిందని గుర్తుచేసింది.
ఈ చర్చలు ప్రాతిపదికగా.. పౌర అణు సహకారానికి సంబంధించి రెండు అత్యంత కీలకమైన అంశాలపై అమెరికాతో ఒక అవగాహనకు రావటం జరిగిందని.. దీనిని ఇరు దేశాల నేతలు (ప్రధాని నరేంద్రమోదీ, ఒబామా) జనవరి 25న ఖరారు చేశారని పేర్కొంది. పౌర బాధ్యత చట్టం ప్రకారం.. అణు విధ్వంసానికి పూర్తి బాధ్యత సదరు అణు కేంద్రాన్ని నిర్వహించే సంస్థకే వర్తిస్తుందని కేంద్రం స్పష్టంచేసింది.
అణు ప్రమాద బాధితులు తమకు జరిగిన నష్టానికి ఇతర చట్టాల కింద అణు సరఫరాదారులను పరిహారం కోరే అవకాశం కూడా లేదని.. దీనికి సంబంధించి ఆయా సంస్థలు లేవనెత్తిన అనుమానాలను కూడా నివృత్తిచేశామని తెలిపింది. భారత్‌కు సరఫరా చేసే అణు పదార్థాల జాడను తెలుసుకునేందుకు.. రెండు దేశాలతో ద్వైపాక్షిక భద్రతా చర్యలు ఏర్పాటు చేసేందుకు అమెరికాకు భారత్ అవకాశం ఇచ్చిందన్న వాదనలను విదేశాంగ శాఖ ప్రతినిధి తోసిపుచ్చారు.