వివేకానందుడు.. ఓ ఆసక్తికరమైన విషయం
న్యూఢిల్లీ: యువతా! అనే సంబోధించిన వెంటనే టక్కున గుర్తొచ్చే పేరు స్వామీ వివేకానంద. ఆయన ఒక్క భారత్‌కు మాత్రమే కాదు మొత్తం ప్రపంచానికే యూత్ ఐకాన్. ఆధ్యాత్మికంగా, మేధోపరంగా, సంస్కృతిపరంగా ఏ అంశంతో పోల్చినా ఆయనకు తెలిసినంత విషయ పరిజ్ఞానం ఇంకెవరికీ ఉండదని చెప్పడం పెద్ద ఆశ్చర్యం కాదేమో. ఏకసంతాగ్రహి అయిన వివేకానందుడు తన అనర్గళమైన ఆంగ్ల ప్రసంగాలతో ప్రపంచం మొత్తాన్ని తన వైపు చూసేలా చేశారు.
సోదరీసోదర మణులారా అనే పదాలకు వన్నె తెచ్చిన మనీషి ఆయన. అలాంటి వివేకానుందుడి గురించి కూడా ఓ అత్యంత ఆసక్తికరమైన విషయం ఉంది. ఆంగ్లంలో చక్కగా మాట్లాడటం, రాయడం చేయగలిగే వివేకానందుడు పరీక్షల్లో మాత్రం చాలా తక్కువ ప్రదర్శన చేసేవారంట. ఆయన రాసిన పరీక్షల్లో వరుసగా 47, 46, 57శాతం మార్కులు మాత్రమే ఆయన సాధించారంట.
ఈ విషయాన్ని ప్రముఖ రచయిత హిందోల్ సేనుగుప్తా తాను రాసిన 'ది మోడ్రన్ మాంక్: వాట్ వివేకానంద మీన్స్ టు అస్ టుడే' అనే గ్రంథంలో వివరించారు. 'వివేకానందుడు మూడు విశ్వవిద్యాలయాల ఆంగ్ల ప్రవేశ పరీక్షలు రాశారు. ఫస్ట్ ఆర్ట్స్ స్టాండార్డ్ (ఎఫ్‌ఏ ఇదే క్రమంగా ఇంటర్మీడియట్‌గా మారింది)లో 46శాతం, బీఏలో 56శాతం, ఆంగ్ల భాషలో 47శాతం మార్కులు సాధించారు' అని రచయిత చెప్పారు. అంతేకాకుండా ఆయన గణితం, సంస్కృతంలో కూడా పరిమితి ప్రతిభనే చూపించారట.