భారత్ మా మాటలను లెక్కచేయడం లేదు: చైనా
బీజింగ్: డొక్లాం పీఠభూమిపై తమ వాదనను భారత్ లెక్కచేయడం లేదని మంగళవారం చైనా విస్మయం వ్యక్తం చేసింది. పద్దతి మార్చుకోకపోతే భారత్‌లోకి మేం ప్రవేశించాల్సివుంటుందని హెచ్చరించింది. అప్పుడు చేయడానికి ఇంకేమీ మిగలదని గత కొన్ని వారాలుగా పాడుతున్న పాటనే మరలా వినిపించింది. గొంతు సవరించుకుని చైనా ఎన్నిమార్లు హెచ్చరికలు చేసిన భారత్ బెదరడం లేదు.
సోమవారం త్వరలో డొక్లాం సమస్యకు శుభం కార్డు వేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. మూడు దేశాలు(చైనా, భారత్, భూటాన్) కలసి చర్చించుకున్న అనంతరమే డొక్లాంపై ఓ నిర్ణయానికి రావాలని భారత్ చైనాను అభ్యర్థించింది కూడా. భూటాన్ డొక్లాం తమ భూభాగంలోనిదని చెబుతుండగా.. చైనా డొక్లాం తమదని అంటోంది.
మంగళవారం చైనా విదేశాంగ ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా రోడ్డు నిర్మాణం చేస్తున్న ప్రదేశంలోకి భారత్ చొరబాటు చేసిందని వ్యాఖ్యానించింది. అందుకు భారత్ చెబుతున్న కారణాలు చైనాను విస్మయానికి గురి చేశాయని పేర్కొంది. భారత్ లాజిక్ సరిగా లేదని, అదే లాజిక్‌తో ప్రతి ఒక్కరూ పొరుగు దేశంలోకి చొరబాటు చేయొచ్చని వ్యాఖ్యానించింది. భారత్.. చైనా సరిహద్దులో భారీ నిర్మాణాలు చేపడితే.. అభద్రతా భావంతో తాము భారత్‌లోకి చొరబాటు చేస్తే ఎలా ఉంటుంది? అని ప్రశ్నించింది.