ప్రాణాలను ఫణంగా పెట్టొద్దు
పోలీసు కొలువు కోసం వచ్చిన అభ్యర్థులకు మారియా హితవు
సాక్షి, ముంబై: సర్ సలామత్ తో పగిడీ పచాస్.. పోలీసు కొలువు కోసం దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యేందుకు వచ్చిన అభ్యర్థులతో నగర పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా అన్న మాటలివి. కొలువు కోసం ప్రాణాలను ఫణంగా పెట్టొద్దని, బతికుంటే ఇలాంటి అవకాశాలు ఎన్నో వస్తాయని, దానిని కాదని మొండిగా పరిగెత్తి ప్రాణాల మీదకు కొనితెచ్చుకోవద్దని అభ్యర్థులకు హితవు పలికారు. పోలీ సు భర్తీ ప్రక్రియలో చోటుచేసుకుంటున్న అపశ్రుతులపై మారియా తీవ్రంగా స్పందించారు. అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలను, పరుగు పరీక్షలను సాధ్యమైనంత త్వరగా ఉదయమే పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
మధ్యాహ్నం విరామం ఇచ్చిన తరువాత మళ్లీ సాయంత్రం నిర్వహించాలని మారియా ఆదేశాలు జారీచేశారు. భర్తీ ప్రక్రియ ప్రారంభమైన వారం రోజుల్లోనే నలుగురు అభ్యర్థులు చనిపోవడంలాంటి దుర్ఘటనలు చోటుచేసుకోవడంతో మారియా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో అభ్యర్థులకు దేహదారుఢ్య, షార్ట్‌పుట్, పరుగు తదితర పరీక్షలు నిర్వహిస్తున్న మైదానాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా హాజరైన అభ్యర్థులకు మార్గదర్శనం చేశారు.
పోలీసు శాఖలో భర్తి అయ్యేందుకు వచ్చే అభ్యర్థులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టొద్దని సూచించారు. తల సక్రమంగా ఉంటే ఎన్ని తలపాగాలైన చుట్టుకోవచ్చు (సర్ సలామత్ తో పగిడి పచాస్). ఈ అవకాశం ఇప్పుడు చేజారిపోతే మళ్లీ ప్రయత్నం చేయవచ్చు. కాని పోయిన ప్రాణాలను తిరిగి తెచ్చుకోలేమని హితవు పలికారు. శాంతి భద్రతలను కాపాడాలన్నా, బందోబస్తూ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలన్నా మానసికంగా, శరీరకంగా ఆరోగ్యంగా ఉండాలని, అందుకే ఈ పరీక్షలు తప్పనిసరి నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఎవరికైతే గుండే, ఊపిరి తిత్తులు, కాలేయానికి సంబంధించిన వ్యాధులు, మూత్రపిండంలో రాళ్లు, రక్తపోటు, చక్కెర, బ్రెయిన్ ట్యూమర్ లాంటి అనారోగ్య సమస్యలుంటే ఐదు కి.మీ. పరుగెత్తనవసరం లేదని, విషయాన్ని ముందే చెప్పాలని, ఒకవేళ మార్గమధ్యలో ఇబ్బందనిపిస్తే పరుగు అక్కడే ఆపేసి వెనకాలే వస్తున్న పోలీసులకు తెలిజేయాలని సూచించారు.
వారు వెంటనే వైద్యం సహా యం అందిస్తారన్నారు. బలవంతంగా పరిగెత్తే ప్రయత్నం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని తెలిపా రు. ఇదిలాఉండగా ఐదు కి.మీ. దూరాన్ని కేవలం 70 శాతం అభ్యర్థులు మాత్రమే పూర్తిచేస్తున్నారు. దీంతో పరుగు పందెం ప్రారంభించే ముందు అక్కడున్న ైవె ద్యులతో పరీక్షలు నిర్వహించి ఆ తరువాత పంపిస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయపడ్డారు. ఇలా చేయడంవల్ల ప్రాణ నష్టాన్ని ముందే అరికట్టవచ్చని రాకేశ్ మారియా కూడా అక్కడ విధు లు నిర్వహిస్తున్న సిబ్బందికి సూచించారు