
దూరదర్శన్ మరో రెండు కొత్త చానళ్లకు శ్రీకారం చుట్టింది.
న్యూఢిల్లీ: దూరదర్శన్ మరో రెండు కొత్త చానళ్లకు శ్రీకారం చుట్టింది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియా సైన్స్ పేరుతో రెండు చానళ్లను దూరదర్శన్ మంగళవారం ప్రారంభించింది. డీడీ సైన్స్ పేరుతో ఒక చానల్‌ను, ఇండియా సైన్స్ పేరుతో వెబ్ చానల్‌ను దూరదర్శన్ ప్రారంభించింది.
ఈ చానళ్ల ప్రారంభోత్సవానికి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హర్షవర్దన్ హాజరై మాట్లాడారు. శాస్త్రీయ దృక్పథం అభివృద్ధికి ఓ చానల్ అత్యవసరమని అందుకు డీడీ సైన్స్ 24/7 చానల్‌ను సైన్స్‌కు అంకితమిస్తునట్లు తెలిపారు. దూరదర్శన్ జాతీయ చానల్‌లో ఒక గంటపాటు డీడీ సైన్స్ చానల్ కార్యక్రమాలుంటాయని, ఇండియా సైన్స్ చానల్ మాత్రం ఇంటర్నెట్ ఆధారిత చానల్ అని పేర్కొన్నారు. దేశంలో ప్రతిభావ్యుత్పత్తులకు, మెరుగైన ఆలోచనలకు కొదవలేదన్నారు.
దేశంలో వాటర్ షెడ్ ఉద్యమం కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్‌కే పరిమితం కాదని సమాజంలో అభివృద్ధి చెందిన శాస్త్రీయ దృక్పథానికి ఆ ఉద్యమం నిదర్శనమన్నారు. త్వరలోనే ఈ డీడీ సైన్స్ చానల్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2030 నాటికి సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రపంచంలోనే మన దేశం మొదటి మూడు స్థానాల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు.