'తాగడం ప్రాథమిక హక్కు'
భోపాల్: ''మద్యం తాగడం ప్రాథమిక హక్కు. అదొక స్టేటస్ సింబల్. మద్యం తాగినంత మాత్రాన నేరాల సంఖ్య పెరగదు. ఎందుకంటే తాగిన తర్వాత వారు విచక్షణ కోల్పోతారు. ఇక నేరాలు ఎలా చేస్తారు.. విడ్డూరం కాకపోతేనూ....'' ఈ మాటలు అన్నది మరెవ్వరో కాదు. సాక్షాత్తూ మధ్యప్రదేశ్ హోం మంత్రి బాబూలాల్ గౌర్.
''మరీ విపరీతంగా తాగకండి.. ఇది మన ప్రాథమిక హక్కు.. మన గౌరవానికి సంబంధించిన అంశం'' అంటూ ఒక ఉచిత సలహా కూడా పడేశారట. రాష్ట్రంలో మద్యం అమ్మకాల సమయాన్ని పొడిగించడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా బాబూలాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా ఈయనే గతంలో మహిళలపై జరుగుతున్నఅత్యాచారాలకు ప్రభుత్వం బాధ్యత వహించదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మహిళా సంఘాల ఆగ్రహానికి గురయ్యారు. తమిళనాడు మహిళలు నిండుగా బట్టలు కట్టుకుంటారు అందుకే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే వారిపై హింస, నేరం కేసులు తక్కువగా నమోదవుతున్నాయని గతంలో కామెంట్ చేశారు. ఒక రష్యన్ మహిళనుద్దేశించి అనుచితంగా వ్యాఖ్యానించి విమర్శల పాలయ్యారు.