సారవంతమైన భూమి నాణ్యత కోల్పోతోంది. ప్రపంచంలో ఏ దిక్కు చూసినా ఎడారులే కనిపిస్తున్నాయి. ఈ ఎడారీకరణ విసురుతున్న సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. గ్రేటర్ నోయిడాలో ఎడారీకరణ విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 14వ సదస్సులో ఎన్నో విషయాలు చర్చకు వస్తున్నాయి. ఇంతకీ ఎడారీకరణ అంటే ఏంటి? ప్రపంచ దేశాల్లో ఎందుకు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
ఎడారీకరణ అంటే?
బంగారు పంటలు పండే భూములు సారాన్ని కోల్పోతూ నిరుపయోగంగా మారిపోవడాన్ని ఎడారీకరణ అంటున్నారు. దీనికి ముఖ్య కారణం గ్లోబల్ వార్మింగే. రుతువులు గతి తప్పి అతివృష్టి, అనావృష్టి ఏర్పడటం, చిత్తడి నేలలు నాశనం కావడం, జీవ వైవిధ్యాన్ని కోల్పోవడం, సముద్ర మట్టాలు పెరిగిపోవడం, కొండచరియలు విరిగిపడి సారవంతమైన నేల కోతకు గురవడంతో ఉత్పాదకత దెబ్బతింటోంది. జనాభా పెరుగుదలతో పట్టణీకరణ జరగడమూ ఎడారీకరణకు దారి తీస్తోంది.
ఎంత నష్టం?
ఎడారీకరణతో ఏటా ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల కోట్ల డాలర్లు నష్టం వస్తోంది. ప్రపంచ ఆర్థిక వనరుల్లో 10–17శాతం కోల్పోతున్నట్లు ఎడారీకరణను ఎదుర్కోవడానికి ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన విభాగం (యూఎన్‌సీసీడీ) వెల్లడించింది. ఇప్పటికే ప్రపంచంలో 360 కోట్ల మందికి ఏడాదిలో నెల రోజుల పాటు నీటి చుక్క కూడా దొరకట్లేదు. పరిస్థితులు ఇలాగే ఉంటే 2050 నాటికి 500 కోట్ల మందికి నీరు అందే పరిస్థితి ఉండదు.
భారత్‌లో పరిస్థితి ఎలా?
2018లో వేసిన అంచనాల ప్రకారం 9.64 కోట్ల హెక్టార్ల భూమి మన దేశంలో ఎడారీకరణకు లోనవుతోంది. అంటే దాదాపుగా 30 శాతం భూములు సారాన్ని కోల్పోతున్నాయి. భారత్‌లో ఎడారీకరణతో ఏడాదికి 4,800 కోట్ల డాలర్ల నష్టం వస్తోంది. ఇది 2015 జీడీపీలో 2.5 శాతంగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణలో 31.4, ఏపీలో 14.35శాతం శాతం భూములు నిరుపయోగంగా మారాయి. అనంతపురం, నల్లగొండలో సమస్య ఎక్కువగా ఉంది.
కంప చెట్టు కొంప ముంచింది..
ప్రాస్పిస్ జులీఫ్లోరా అంటే తెలుసా? దాన్నే కంప చెట్టు అంటారు. గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో నీళ్లల్లో ఉప్పు శాతాన్ని తగ్గించడం కోసం ఈ చెట్లను నాటాలని 1960లో ప్రణాళిక సంఘం సిఫారసు చేసింది. సాంకేతిక పరిజ్ఞానం ఈ స్థాయిలో అప్పట్లో లేకపోవడంతో అవగాహనా రాహిత్యంతో హెలికాప్టర్ నుంచి 3 వేలకు పైగా హెక్టార్లలో ఈ కంప విత్తనాలు జల్లారు. ఆ కంప చెట్లు అలా అలా పెరిగి పర్యావరణాన్ని నాశనం చేయడమే కాదు.. ఆర్థిక వ్యవస్థే కంపించేలా చేస్తున్నాయి. 1997లో 6% భూముల్లో ఉన్న ఈ కంప చెట్లు 2009 సరికి 33% భూముల్లో విస్తరించాయి. 2015 నాటికి 54% భూముల్లో పెరిగాయి. ఇవి విపరీతంగా నీటిని పీల్చుకోవడంతో కచ్ ప్రాంతంలో ఎడారీకరణ పెరిగిపోయింది.
పరిష్కార మార్గాలేంటి?
నీటి వనరుల సక్రమమైన నిర్వహణే ఎడారీకరణకు అసలు సిసలు పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. సుస్థిర అభివృద్ధిని లక్ష్యంగా నిర్ణయించుకొని నాణ్యత కోల్పోయిన భూముల్ని తిరిగి సాగులోకి తెచ్చే ప్రయత్నాలు చేయాలి. ఇందుకోసం భారత్ రిమోట్ సెన్సింగ్, స్పేస్ టెక్నాలజీని వినియోగిస్తోందన్నారు.
ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం..
- ప్రపంచ దేశాల్లో 40 శాతానికిపైగా భూములు ఎడారీకరణలో ఉన్నాయి.
- 100కి పైగా దేశాల్లో ఎడారీకరణ ముప్పు ఉన్నాయి.
- ఈ భూమిలో 75 శాతం భూమి నాణ్యత దెబ్బ తింది.
- ఎడారీకరణకు గురైన ప్రాంతాల్లో 302 కోట్ల మంది జీవిస్తున్నారు.
- 2030 నాటికి 500 కోట్ల మంది ప్రజలు ఎడారీకరణ ప్రాంతాల్లోనే నివసిస్తారని అంచనా
- 2050 నాటికి 90 శాతానికి పైగా భూమి సారాన్ని కోల్పోతుందని అంచనా.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment