'వారి జీవితమంతా కూల్చివేతలే'
పట్నా: బిహార్ లో రాష్ట్రపతి పాలన విధించాలన్న డిమాండ్ పై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ మండిపడ్డారు. జితన్ రామ్ మాంఝీ, రాంవిలాస్ పాశ్వాన్ రాజకీయ జీవితమంతా ప్రభుత్వాల కూల్చివేతలకే కేటాయించారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి పట్టించుకోకుండా వీరిద్దరూ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని దుయ్యబట్టారు.
తమ రాజకీయ జీవితం పునరుద్ధరణకు ఇటువంటి కుయుక్తులు పన్నుతున్నారని, బిహార్ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో బలవంతంగా రాష్ట్రపతి పాలన విధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. జేడీ(యూ)-ఆర్జేడీ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని, బిహార్ లో రాష్ట్రపతి పాలన విధించాలని మాంఝీ, పాశ్వాన్ అంతకుముందు డిమాండ్ చేశారు.