ప్రియమైన అమ్మా నాన్నా..
* తల్లిదండ్రులు ఓటు వేసేవిధంగా పిల్లలతో కౌన్సెలింగ్
* ఓటింగ్ శాతం పెంచడానికి స్కూలు విద్యార్థులను ఆశ్రయించిన ఈసీ
* సంకల్ప పత్రాలపై సంతకాలు పెట్టించి తీసుకురావాలని సూచన
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూసేందుకు ఎన్నికల కమిషన్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఆశ్రయించింది. తమ తల్లిదండ్రులతో ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించాల్సిన బాధ్యతను వారిపై ఉంచింది. పిల్లల భవిష్యత్తు కోసం ఫిబ్రవరి 7న ఓటు వేస్తామని ప్రతిజ్ఞ పత్రంపై తల్లిదండ్రులతో సంతకం చేయించి తీసుకురావాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు విద్యాశాఖ స్కూలు విద్యార్థులను కోరింది.
‘ప్రియమైన అమ్మా నాన్నా ... మీరు నన్ను ఎంతో ప్రేమిస్తారని, నా భవిష్యత్తును ఉజ్వలంగా ఉంచడం కోసం రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తారని నాకు తెలుసు. నా భవిష్యత్తు పటిష్టమైన ప్రజాస్వామ్యంతో గట్టిగా ముడిపడిఉంది. అందుకే మీరు ఫిబ్రవరి 7న ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయాలని నేను కోరుతున్నాను. మీరు మీ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారన్న నమ్మకం నాకుంది..’ అని రాసి ఉన్న సంకల్పపత్రాలను విద్యాశాఖ విద్యార్థులకు పంచింది. విద్యార్థులు వీటి పై తల్లిదండ్రులతో సంతకం చేయించి స్కూలు టీచర్లకు తిరిగి ఇవ్వవలసి ఉంది.
ఢిల్లీ సర్కార్, ఎమ్సీడీ, ఎన్‌డీమ్సీ , ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డు నడిపే స్కూళ్లలో ఇటువంటి సంకల్ప పత్రాలను విద్యార్థులకు పంచినట్లు జాయింట్ చీఫ్ ఎలక్టొరల్ ఆఫీసర్ రాజేష్ గోయల్ తెలిపారు. ఈ పత్రాలను పిల్లలకు ఇచ్చి వారి తల్లిదండ్రులతో సంతకం చేసిన తర్వాత వాటిని తిరిగి ఫిబ్రవరి 5 వరకు పిల్లల నుంచి సేకరించవలసిన బాధ్యతను విద్యాశాఖ స్కూలు అధికారులకు అప్పగించింది. పిల్లలు ఈ పత్రాలను ఇంటికి తీసుకుపోవడం వల్ల కుటుంబసభ్యుల మధ్య కొంత చర్చ జరుగుతుందని, దాని వల్ల ఓటింగ్‌పై అవగాహన పెరుగుతుందని ఎన్నికల కమిషన్ ఆశిస్తోంది. ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం పిల్లలకు కూడా కల్పించడం వల్ల ఓటింగ్ శాతం పెరగడంతో పాటు రాజకీయ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకునే అవకాశం కూడా పిల్లలకు లభిస్తుందని స్కూలు ప్రిన్సిపాళ్లు అంటున్నారు. గత ఎన్నికల సమయంలోనూ తల్లి దండ్రులతో ఓటు వేయించాలని పిల్లలను కోరినప్పటికీ సంకల్పపత్రాలను పంచి తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ చేయించడం మాత్రం ఇదే మొదటిసారని వారు అంటున్నారు.