2012 బడ్జెట్ ఆలస్యంపై కేంద్రాన్ని కోరిన ఈసీ
న్యూఢిల్లీ: 2012లో కేంద్ర బడ్జెట్ ఆలస్యంగా ప్రవేశపెట్టడానికి ఎటువంటి విధానాలు పాటించారో తెలపాలని ఎన్నికల కమిషన్ కేబినెట్ సెక్రటేరియట్‌ను కోరింది. దీనిపై శుక్రవారం ఉదయంలోగా వివరాలు సమర్పించాలని కోరినట్లు సమాచారం. దీంతోపాటు బడ్జెట్ రూపకల్పనలోనూ, ప్రవేశపెట్టడంలోనూ ఉండే వివిధ దశలకు సంబంధించిన సమగ్రసమాచారాన్నికూడా అందజేయాలని ఈసీ కేంద్రాన్ని కోరింది. 2012లో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటంతో ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి.
దీంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం బడ్జెట్‌ను ఫిబ్రవరి 28 నుంచి మార్చి 16కు వాయిదా వేసింది. ప్రస్తుతం ఐదురాష్ట్రాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బడ్జెట్‌ను వాయిదా వేయాలని విపక్షాలు ఎన్నికల కమిషన్ ను కోరాయి. దీనిపై ఈసీ కేంద్రాన్ని వివరణ కోరింది.