మంచి ప్రతిపక్షాన్ని ఎన్నుకుందాం!
గెస్ట్‌కాలమ్: (మహేశ్ పేరి) ఒక్కసారి చుట్టూ చూడండి.. అవే ముఖాలు.. ఆ రాజకీయ నాయకులే.. ఆ అధికార దళారులే.. ఆ లాబీయిస్టులే.. ఆ ప్రలోభాలే. కాకపోతే వారి పాత్రలు మారిపోతాయి. ఒకరు అధికారంలో ఉంటే మరొకరు ప్రతిపక్షంలో ఉంటారు.
మరో వర్గం ఉంటుంది. సొంతంగానో, ఆహ్వానం మీదనో గెలిచే అవకాశమున్న పార్టీలోకి వెళ్లే గెలుపు గుర్రాల వర్గం అది. ఓడిపోబోతున్న ప్రభుత్వ విధానాలను కొనసాగించేందుకు వారు అధికారం చేపట్టబోయే పార్టీలోకి వెళ్తారు.
విపక్షం ఎక్కడ?
యూపీఏ ప్రభుత్వం ఒక వినాశనమన్న విషయంలో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే.. తప్పుల్ని ఎత్తిచూపి ప్రజాస్వామ్యాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన మరో వ్యవస్థకు ఏమైంది? ఆ వినాశనాన్ని అడ్డుకోవాల్సిన అవసరం దానికి లేదా? ఒక్కమాటలో అడగాలంటే.. గత పదేళ్లుగా ప్రతిపక్షం ఏం చేస్తోంది? ప్రతిపక్షంగా బీజేపీ సరిగ్గా వ్యవహరించిందా? లేదా.. ప్రతిపక్షం లేదనుకోవాలా? గత పదేళ్లలో చోటుచేసుకున్న కుంభకోణాలను పరిశీలించండి. 2జీ స్పెక్ట్రం, బొగ్గు కుంభకోణం, ఆదర్శ్ హౌసింగ్, అక్రమ మైనింగ్, బీసీసీఐ.. ఇలా ఏ కుంభకోణాన్నైనా చూడండి. ప్రతిపక్షం లేదనే అనిపిస్తుంది. నిశితంగా చూస్తే ప్రభుత్వం, ప్రతిపక్షం.. రెండూ కుమ్మక్కైన తీరు కూడా తెలుస్తుంది. ఆ రెండూ ఒకే నాణేనికి రెండు ముఖాలని అర్థమవుతుంది. ఆ కుంభకోణాల్లో రెండు వైపులా లబ్ధిదారులన్న విషయం స్పష్టమవుతుంది. ప్రచారార్భాటానికి పైపై డాంబికాలు తప్పిస్తే.. ప్రభుత్వంలో ఉన్న పార్టీ వైఫల్యాన్ని ఎండగట్టే నిజమైన ప్రయత్నం మాత్రం ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా చేయదు. చేయబోదు.
ఉమ్మడి వైఫల్యం
ప్రభుత్వ, ప్రతిపక్షాలు రెండూ కలసికట్టుగా, వ్యూహాత్మకంగా విఫలం కావడమే భారత్ వైఫల్యానికి ప్రధాన కారణం. ఎవరైనా ఎక్కడైనా గొంతెత్తితే.. డబ్బుతో వారి నోరు మూయిస్తారు. అధికారంలోకి రాగానే స్విస్ బ్యాంకుల్లోని నల్లడబ్బుని భారత్‌కు తెప్పిస్తామని, భోఫోర్స్ డబ్బు కక్కిస్తామని బీజేపీ మాటలు చెబుతోంది. మరి గతంలో ఆరేళ్లకు పైగా అధికారంలో ఉన్నప్పుడు ఆ పని ఎందుకు చేయలేదు?. కాంగ్రెస్ అంతే.. మాటలకు, చేతలకు పొంతన ఉండదు. దాదాపు గత పాతికేళ్ల ఆర్థిక సరళీకరణల నేపథ్యంలోని ప్రభుత్వాలను పరిశీలిస్తే.. ఏ పార్టీ, ఏ ప్రభుత్వం.. అధికారంలో ఉన్నా వారి లక్ష్యం ఒక్కటే అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 100 కోట్ల ప్రజలను దోచి.. 20 కోట్ల మందికి ప్రయోజనం కలిగించడమే ఆ లక్ష్యం.
మార్పు కోసం..
మనకు పాలకులు చాలా మంది ఉంటారు. మోడీ, ఆయన బృందం ఎన్ని మాటలు చెప్పినా.. యూపీఏ ఓడిపోయి సోనియాగాంధీ ప్రతిపక్షంలో ఉన్నా.. ఆమె రూలర్‌గానే ఉంటారు. కాంగ్రెస్ ఓడిపోయినా రాహుల్‌గాంధీ షెహజాదా(యువరాజు)గానే ఉంటారు. రాబర్ట్ వాద్రా వ్యాపారాలు కొనసాగుతూనే ఉంటాయి. నల్లడబ్బు స్విస్‌బ్యాంకుల్లోనే ఉంటుంది. స్టాక్‌మార్కెట్ల జోరు సాగుతూనే ఉంటుంది. రియల్ ఎస్టేట్ ధరలు పెరుగుతూనే ఉంటాయి. డబ్బున్నవారంతా హ్యాపీగానే ఉంటారు. అందువల్ల ఈ ఎన్నికల్లో ఒక నిజమైన ప్రతిపక్షాన్ని పార్లమెంటులో కూచోబెడదాం. మన ప్రయోజనాలను కాపాడే ప్రతిపక్షాన్ని.. మనల్ని రక్షించే ప్రతిపక్షాన్ని.. మన అభిప్రాయాలను ప్రతిబింబించే ప్రతిపక్షాన్ని.. మన డబ్బును కాపాడే ప్రతిపక్షాన్ని ఈసారి లోక్‌సభకు పంపిద్దాం. మంచి ప్రతిపక్షాన్ని ఎన్నుకుందాం.
రచయిత, రాజకీయ విశ్లేషకులు,
కెరీర్‌స 360 సంస్థ చైర్మన్
ఊడ్చేస్తా...
ఓసారి ఉన్నట్టుండి చీపురుకట్ట పట్టుకొని రోడ్లపై ప్రత్యక్షమవుతుంది.. రోడ్లన్నింటినీ శుభ్రంగా ఊడ్చేస్తుంది.. మరోసారి సాదాసీదాగా చుడీదార్ ధరించి.. బైక్‌పై వచ్చేస్తుంది..! ఆమెవరో కాదు.. గోవా లోక్‌సభ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ తరఫున పోటీ పడుతున్న స్వాతి కేర్కర్(39)! మధ్యతరగతి నేపథ్యం ఉన్న స్వాతి సామాజిక కార్యకర్త. గోవాలో బహుళజాతి ప్రాజెక్టులకు, సెజ్‌లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీధర్ కేల్కర్ కూతురుగానే కాకుండా ఉద్యమకారిణిగా దక్షిణ గోవాలో చాలామందికి చిరపరచితురాలు. నిరుద్యోగి అయిన స్వాతికి ఎన్నికల నామినేషన్ సందర్భంగా డిపాజిట్ కట్టడానికి అవసరమైన రూ. 25వేలు కూడా లేవట. అప్పటికప్పుడు విరాళాలు సేకరించి డిపాజిట్ మొత్తం కట్టారట! స్వాతి కేర్కర్ ప్రచారం కూడా హంగూఆర్భాటాలు లేకుండా సాగుతోంది. పార్టీ కార్యకర్తల బైక్ వెనక కూచుని ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.