ఢిల్లీ ఎన్నికల పోరు నేడే | Election Fighting Delhi today | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ఎన్నికల పోరు నేడే

Published Sat, Feb 7 2015 7:13 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

ఢిల్లీ ఎన్నికల పోరు నేడే - Sakshi

ఢిల్లీ ఎన్నికల పోరు నేడే

హోరాహోరీ ప్రచారం.. నేతల మాటల యుద్ధం.. విమర్శలు, ప్రతి విమర్శల దాడి.. వీటన్నింటికీ తాళం వేస్తూ ఢిల్లీ ఓటరు నేడు ‘ఓటు’ ఆయుధంతో ముందుకు కదలనున్నాడు!

  • ఓటింగ్ శాతంపైనే అందరి దృష్టి
  • మధ్య తరగతి, మహిళలు పోటెత్తితే బీజేపీకి అనుకూలం!
  • దిగువ మధ్య తరగతి తరలి వస్తే ఆప్‌కు లాభం
  • సాక్షి, న్యూఢిల్లీ: హోరాహోరీ ప్రచారం.. నేతల మాటల యుద్ధం.. విమర్శలు, ప్రతి విమర్శల దాడి.. వీటన్నింటికీ తాళం వేస్తూ ఢిల్లీ ఓటరు నేడు ‘ఓటు’ ఆయుధంతో ముందుకు కదలనున్నాడు! 673 మంది భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నాడు. శనివారం 1.33 కోట్ల మంది ఓటర్లు తమ ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించుకోబోతున్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం 12,177 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

    బీజేపీ, ఆప్ మధ్య నువ్వా.. నేనా అన్నట్టుగా సాగుతున్న ఈ ఎన్నికల పోరులో ఏ పార్టీకి అధిక సీట్లు వస్తాయన్నది తలలు పండిన రాజకీయ నేతలలూ అంచనా వేయలేకపోతున్నారు. వివిధ టీవీ చానళ్లు, సంస్థలు నిర్వహిస్తున్న సర్వేల ఫలితాలు రోజురోజుకు మారిపోతూ ఎన్నికల వాతావరణాన్ని మరింత ఉత్కంఠంగా మార్చేశాయి. శనివారం నాటి ఓటింగ్ శాతమే కీలకం కాగలదని నిపుణులు చెబుతున్నారు.

    14 నెలల్లోనే మూడోసారి ఓటేయాల్సి రావడంతో.. ఓటింగ్ శాతం తగ్గవచ్చని కొందరంటుండగా, వేడెక్కిన రాజకీయ వాతావరణం ఓటరును పోలింగ్ బూత్‌ల వైపు ఆకర్షిస్తుందని మరికొందరి అంచానా. మధ్యతరగతి ఓటరు, మహిళలు అనూహ్య సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తే ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉంటాయని, దిగువ మధ్యతరగతి ఓటర్లు పోటెత్తితే ఆప్‌కు కలిసొస్తుందని అంటున్నారు. దీంతో ఓటింగ్ శాతం ఎంత నమోదవుతుందన్నది ఆసక్తిగా మారింది.
     
    నాడు ఇలా.. మరి నేడో..! 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ఓటర్లు పెద్దసంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ఏకంగా 78.1 లక్షల ఓటర్లు ఓటేశారు. దీంతో రికార్డు స్థాయిలో 65.86 శాతం ఓటింగ్ నమోదైంది. 65.78 శాతం పురుషులు, 65.17 శాతం మహిళలు ఓట్లేశారు. సాయంత్రం 5 దాటిన తర్వాత కూడా పోలింగ్ కేంద్రాల ముందు క్యూలు ఉండడంతో రాత్రి తొమ్మిదిన్నర  వరకు ఓటేసేందుకు అనుమతించారు. దీంతో ఓటు బ్యాంకులు తారుమారై ఫలితాలూ అనూహ్యంగానే వచ్చాయి.

    15 ఏళ్లుగా ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ చిత్తయిపోయింది. ఎన్నికల ముందు ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ సంచలనమే సృష్టించింది. అధికారం దక్కుతుందని ఆశించిన బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినా సర్కారు ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ సంపాదించలేకపోయింది. 70 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 8, బీజేపీ, దాని మిత్రపక్షమైన అకాళీదళ్‌కు కలిపి 32, ఆప్‌కు 28 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 24.55 శాతం, ఆప్‌కు 29.49 శాతం, బీజేపీకి 33.07, అకాలీదళ్‌కు ఒక శాతం ఓట్లు వచ్చాయి. ఎన్నికల తర్వాత ఆప్, కాంగ్రెస్ మద్దతుతో సర్కారు ఏర్పాటు చేయడం, జన్‌లోక్‌పాల్ బిల్లుపై వివాదం నేపథ్యంలో 49 రోజులకే రాజీనామా చేయడం, రాష్ట్రపతి పాలన విధించడం తెలిసిందే.
     
    ఏడాదిపాటు రాష్ట్రపతి పాలనలో ఉన్న ఢిల్లీలో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది . కేంద్రంలో మోదీ సర్కారు కొలువుదీరడంతో దేశ రాజధానిలో బీజేపీ బలీయమైన శక్తిగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌వైపు మొగ్గు చూపిన కొందరు మధ్యతరగతి ఓటర్లు మళ్లీ బీజేపీ వైపు మళ్లారు. కాంగ్రెస్ ఓటుబ్యాంకును లాక్కున్న ఆప్.. బీజేపీకి గట్టి ప్రత్యర్థిగా మారింది. ఆప్ ప్రభంజనం తగ్గలేదని తేలడంతో బీజేపీ కూడా వ్యూహాత్మకంగా కిరణ్ బేడీని తెరపైకి తెచ్చింది. ఇక తమది మూడో స్థానమేనని కాంగ్రెస్ నేతలు  ఒప్పుకుంటున్నారు. కిందటిలా కాకుండా ఈసారైనా ఓటరు ఏదో ఒక పార్టీకి పట్టం కడతాడో లేదా నేతలను ‘త్రిశంకు’స్వర్గంలో ఉంచుతాడో చూడాలి!
     
    సుస్థిరత, అరాచకత్వం మధ్య పోరు: జైట్లీ

    ఢిల్లీలో ఎన్నికలను సుస్థిరత, అరాచకత్వానికి మధ్య జరుగుతున్న పోరుగా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అభివర్ణించారు. 49 రోజలు ఆప్ పాలనను చూస్తే ఆ పార్టీ ‘అరాచకవాదం’ తెలుస్తుందన్నారు. శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. పాలన కొనసాగించాల్సిన వారు వీధుల్లో ఆందోళన చేయడం, గణతంత్ర దినోత్సవ వేడుకలను అడ్డుకోవాలనే హెచ్చరికలు చేయడం వంటివి వాటిని ఉదహరించారు.  దేశ రాజకీయాల్లో మార్పు కనిపిస్తోందని, ఇటీవలి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని చెప్పారు.మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ 8 నెలల పాలనలో స్కాంలు లేవన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement