కొన్నాళ్ల కిందట పార్టీ అధిష్టానాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించారంటూ తన సొంత కుమారుడు అళగిరిపై సస్పెన్షన్ వేటు వేసి సంచలనం సృష్టించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మరోసారి అళగిరిపై క్రమశిక్షణ కొరడా ఝుళిపించారు.
రాష్ట్రపతి ఆమోదానికి ఎన్నికల షెడ్యూల్
న్యూఢిల్లీ: తొమ్మిది దశల లోక్‌సభ ఎన్నికల తేదీలను నోటిఫై చేసే ప్రక్రియకు ప్రభుత్వం సోమవారం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎన్నికల సంఘం సిఫార్సు చేసిన ఎన్నికల తేదీల వివరాలను రాష్ట్రపతికి పంపింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఏప్రిల్ 7 నుంచి ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఈ నెల 13న మొదటి నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సోమవారమిక్కడ సమావేశమైన కేంద్ర మంత్రివర్గం వివిధ దశల కోసం నోటిఫికేషన్ల జారీకి ఆమోదం తెలియజేయాల్సిందిగా రాష్ట్రపతికి సిఫార్సు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నెల 5న కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడం విదితమే. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం కమిషన్ ఎన్నికల షెడ్యూల్ వివరాలను ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది.
అరుణాచల్‌లో లోక్‌సభతోపాటే అసెంబ్లీకి...
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను లోక్‌సభ ఎన్నికలతోపాటే ఏప్రిల్ 9న నిర్వహించనున్నట్లు సోమవారం రాత్రి ఎన్నికల సంఘం ప్రకటించింది. అరుణాచల్‌లో 60 అసెంబ్లీ, 16 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం నవంబరు 4 వరకూ ఉంది. అయితే ఆ రాష్ట్ర అసెంబ్లీని కేబినెట్ సిఫారసుల మేరకు రద్దు చేస్తున్నట్లు గవర్నర్ నిర్భయ్ సింగ్ మార్చి 6న ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఈసీ నిర్ణయం తీసుకుంది.
లాలూ కుమార్తెపై రామ్‌కృపాల్ పోటీ
పాట్నా: లోక్‌సభ టికెట్ ఇవ్వనందుకు ఆర్జేడీ నుంచి బయటకు వచ్చిన సీనియర్ నేత రామ్‌కృపాల్ యాదవ్... లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తెతో తాడోపేడో తేల్చుకోనున్నారు. పాటలీపుత్ర నియోజకర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు రామ్‌కృపాల్ సోమవారం పాట్నాలో మీడియాకు తెలిపారు. ఆర్జేడీ అధినేత లాలూ పాటలీపుత్ర స్థానానికి తన పెద్ద కుమార్తె మీసా భారతి పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని విభేదించి పార్టీని వీడిన రామ్‌కృపాల్ అదే స్థానం నుంచి పోటీకి సిద్ధం కావడంతో రాజకీయం వేడెక్కనుంది.
ఆంధ్రప్రదేశ్ బరిలో సమాజ్‌వాదీ
సాక్షి, న్యూఢిల్లీ: ములాయంసింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని తిరుపతి, మచిలీపట్నం, వరంగల్, అరకు, నరసాపురం లోక్‌సభ స్థానాలతోపాటు, తొమ్మిది శాసనసభ స్థానాలకు (నెల్లూరు సిటీ, జనగామ, వరంగల్ తూర్పు, చీరాల, వర్ధన్నపేట, తిరువూరు, మచిలీపట్నం, కర్నూలు, అవనిగడ్డ) పార్టీ తరపున పోటీచేయబోయే అభ్యర్థుల పేర్లను ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌గోపాల్ యాదవ్ లక్నోలో సోమవారం మీడియాకు వెల్లడించారు.
కుమారుడిపై ‘కరుణ’ లేమి!
చెన్నై: కొన్నాళ్ల కిందట పార్టీ అధిష్టానాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించారంటూ తన సొంత కుమారుడు అళగిరిపై సస్పెన్షన్ వేటు వేసి సంచలనం సృష్టించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మరోసారి అళగిరిపై క్రమశిక్షణ కొరడా ఝుళిపించారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో అళగిరికి టికెట్ ఇచ్చేందుకు తిరస్కరించారు. అదేవిధంగా ఆయన మద్దతుదారులైన డి.నెపోలియన్, జీకే రితీష్‌లకు కూడా టికెట్లను నిరాకరించారు. మరోపక్క, 2జీ కుంభకోణంలో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న ఏ రాజా (నీలగిరి స్థానం), దయానిధి మారన్(సెంట్రల్ చెన్నై)లకు మరోసారి టికెట్లు ఇవ్వడం సంచలనానికి తెరతీసింది. సిట్టింగుల్లో టీఆర్ బాలు సహా 8మందికి తిరిగి టికెట్టు కేటాయించారు. తమిళనాడు, పుదుచ్చేరిలోని మొత్తం 40 ఎంపీ సీట్లకుగాను 5 స్థానాలను తమ కూటమి పార్టీలకు కేటాయించినట్టు తెలిపారు.