న్యూఢిల్లీ: రామ జన్మస్థలం గురించి పలు ఇంగ్లిష్ పుస్తకాల్లో ఉన్న విషయాలను రామ్‌లల్లా విరాజ్‌మాన్ హిందూ సంస్థ తరఫు వాదనలు వినిపిస్తున్న లాయర్ వైద్యనాథన్ సుప్రీంకోర్టులో ప్రస్తావించారు. ఇంగ్లిష్ వ్యాపారి విలియం ఫించ్ 1608–1611కాలంలో భారత్‌ను సందర్శించినపుడు ‘ఎర్లీ ట్రావెల్స్ టు ఇండియా’ పుస్తకం రాశాడని, ఆ పుస్తకంలో రామజన్మస్థలం ప్రస్తావించాడని కోర్టుకు తెలిపారు. అయోధ్యలోని ఓ కోటలో రాముడు జన్మించాడని హిందువులు విశ్వసిస్తున్నట్లు విలియమ్ తన పుస్తకంలో పేర్కొన్నాడని చెప్పారు. దీంతో పాటు బ్రిటీష్ సర్వేయర్ మాంటిగోమేరీ మార్టిన్, జోసెఫ్ టైఫెంథ్లర్ అనే జుసెట్ మిషనరీలు తమ ట్రావెలర్స్‌లో రామజన్మస్థలాన్ని ప్రస్తావించారని కోర్టుకు నివేదించారు. అయితే ఈ ప్రదేశం మొట్టమొదటిసారిగా బాబ్రీ మసీదు అని ఎప్పుడు పిలవబడిందో చెప్పాలని ధర్మాసనం వైద్యనాథన్‌ను ప్రశ్నించింది. 19వ శతాబ్దంలో అలా పిలవబడి ఉండొచ్చని ఆయన తెలిపారు. 19వ శతాబ్దానికి ముందు అలా పిలవబడిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. దీని గురించి బాబర్‌నామాలో (బాబర్ గురించి రాసిన పుస్తకం) ఏం రాయలేదా అని అడిగగా.. లేదని వైద్యనాథన్ సమాధానమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment