‘ఒక్క చెంప దెబ్బ చాలు.. నా వెనుక ఐఎస్‌ఐ ఉంది’ | Ex IB Officer Comments On Jaish E Mohammad Chief Masood Azhar | Sakshi
Sakshi News home page

ఒక్క చెంప దెబ్బకే నిజాలన్నీ కక్కేశాడు!

Published Tue, Feb 19 2019 10:25 AM | Last Updated on Tue, Feb 19 2019 4:39 PM

Ex IB Officer Comments On Jaish E Mohammad Chief Masood Azhar - Sakshi

గత గురువారం నుంచి యావత్‌ భారతావని ఆగ్రహంతో రగిలిపోతోంది. 43 మంది సైనికుల ప్రాణాలను బలిగొన్న ముష్కరుల భరతం పట్టాలని కోరుకుంటోంది. మన ఆకాంక్షలకు అనుగుణంగానే భద్రతా బలగాలు పుల్వామా ఉగ్రదాడికి కీలక సూత్రధారిగా భావిస్తున్న రషీద్‌ ఘాజీని మట్టుబెట్టి సగం ప్రతీకారం తీర్చుకున్నాయి. అయితే ఇందుకు మూలకారణమైన జైషే మహ్మద్‌ అధినేత మసూద్‌ అజర్‌ను కూడా అంతం చేస్తేనే అమర జవాన్ల త్యాగానికి ఫలితం దక్కినట్లు అవుతుందని భారతీయులు గట్టిగా విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో మసూద్‌ పట్టుకోవడం కాస్త కష్టంతో కూడుకున్న పనే అయినా అసాధ్యం మాత్రం కాదని.. గతంలో అతడిని విచారించిన పోలీసు ఉన్నతాధికారి తన ఆనాటి అనుభవాలను పంచుకున్నారు.

పుల్వామా దాడికి తామే బాధ్యులమని జైషే మహ్మద్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎక్కడైతే తన మేనల్లుళ్ల(తాలా రషీద్ (2017)‌, ఉస్మాన్‌ (2018))ను భారత జవాన్లు హతమార్చారో చేశారో.. అదే జిల్లాలో జవాన్లే లక్ష్యంగా దాడికి సిద్ధం చేయాలంటూ మసూద్‌ భావించాడని.. అందుకే దాడి చేసేందుకు ‘పుల్వామా’ ను ఎంచుకున్నాడని ఇంటిలెజిన్స్‌ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ స్థాయిలో ప్రాణ నష్టం సంభవిస్తుందని వారు ఊహించి ఉండకపోవచ్చు. నిజానికి భద్రతా వైఫల్యం వల్లే ఇంతటి దారుణం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పుల్వామా నాటి దాడిని.. ప్రణాళికను పక్కాగా అమలు చేయడంలో విజయవంతమైన మసూద్‌.. 1994లోనే నకిలీ పాస్‌పోర్టు కేసులో అరెస్టయ్యాడు. పోర్చుగీసు పాస్‌పోర్టుతో బంగ్లాదేశ్‌ గుండా.. భారత్‌లో ప్రవేశించి.. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌కు చేరుకున్నాడు. అయితే మసూద్‌ పన్నాగాన్ని పసిగట్టిన ఇంటలెజిన్స్‌ వర్గాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి. ఆ సమయంలో ఆనాటి ఇంటలిజెన్స్‌ అధికారి(కశ్మీర్‌ డెస్క్‌ హెడ్‌), సిక్కిం మాజీ డీజీపీ అవినాశ్‌ మోహననే అతడిని విచారించారు.(పుల్వామా ఉగ్రదాడి‌; మాస్టర్‌ మైండ్‌ హతం!)

ఒక్క చెంప దెబ్బ చాలు...
‘అతడి విచారణ మాకు అంతగా కష్టంగా అనిపించలేదు. విచారణలో భాగంగా కోట్‌ బల్వాల్‌(జమ్ము కశ్మీర్‌) జైలులో అతడిని చాలా సార్లు కలిశాను. ఎన్నో గంటల పాటు ప్రశ్నలు సంధించాను. అయితే అతడి నుంచి సమాధానం రాబట్టడం కోసం ఎటువంటి కఠిన పద్ధతులు ఉపయోగించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఓ ఆర్మీ అధికారి కొట్టిన ఒకే ఒక చెంప దెబ్బ అతడిని నిలువెల్లా వణికించింది. ఆ తర్వాత విచారణలో అఫ్గాన్‌ ఉగ్రవాదులు కశ్మీర్‌ లోయలోకి ఎలా వస్తున్నారు.. అదే విధంగా ఉగ్ర సంస్థలు హర్కత్‌-ఉల్‌- ముజాహిద్దీన్‌, హర్కత్‌ ఉల్‌ జీహాద్‌ ఈ ఇస్లామీలు... హర్కత్‌ ఉల్‌ అన్సార్‌ అనే ఒకే సంస్థగా ఆవిర్భవించిన తీరు.. దానికి జనరల్‌ సెక్రటరీగా తాను ఎదిగిన క్రమాన్ని మసూద్‌ వివరించాడు. కశ్మీర్‌కు చేరు‍కునే ముందే సహరన్‌పూర్‌ వెళ్లి హర్కత్‌ ఉల్‌ అన్సార్‌ ఏర్పాటైతే కలిగే ప్రయోజనాల గురించి ఇరు సంస్థలకు అర్థమయ్యేలా చెప్పానని తెలిపాడు. కాలినడకన వాస్తవాధీన రేఖను దాటలేకపోయానని. అందుకే ఫోర్జరీ పాస్‌పోర్టుతో భారత్‌ వచ్చానని మసూద్‌ చెప్పినట్లు’  మోహననే ఓ జాతీయ మీడియాతో వ్యాఖ్యానించారు.

నా వెనుక ఐఎస్‌ఐ ఉంది...
మసూద్‌ను విడిపించుకునేందుకు అతడి అనుచరులు ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఐసీ-814 విమానాన్ని హైజాక్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా అప్పటి బీజేపీ(సంకీర్ణ) ప్రభుత్వం మసూద్‌ను విడుదల చేసింది. ఆ తర్వాతే అతడు జైషే మహ్మద్‌ను స్థాపించి తన ఉగ్ర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈ విషయం గురించి మోహననే మాట్లాడుతూ... మసూద్‌ విడుదలయ్యే నాటికి తాను కొత్త పోస్టులోకి మారానని చెప్పారు. అయితే తాను విడుదలవుతానని మసూద్‌కు గట్టి నమ్మకం ఉండేదని పేర్కొన్నారు. ‘ మీరు నన్ను తక్కువగా అంచనా వేస్తున్నారు. నిజాలు చెప్పినంత మాత్రాన సరిపోదు కదా.  ఐఎస్‌ఐ(ఇంటర్‌ సర్వీస్‌ ఇంటలెజిన్స్‌) నన్ను పాకిస్తాన్‌కు తిరిగి తీసుకువెళ్తానని హామీ ఇచ్చిందని మసూద్‌ విచారణలో అనేవాడు’ అని మోహననే చెప్పుకొచ్చారు. తద్వారా ఉగ్రవాదులకు పాకిస్తాన్‌ ఆశ్రయం కల్పిస్తోందని, ఇందులో భాగంగా ఐఎస్‌ఐ ఇటువంటి ఉగ్రవాదుల ముసుగులో ప్రచ్ఛన్న యుద్ధాన్ని ప్రోత్సహిస్తోందనే విషయం స్పష్టంగా అర్థమైందని పేర్కొన్నారు.

కాగా 1994, ఫిబ్రవరిలో మసూద్‌ అరెస్టైన 10 నెలల తర్వాతే అతడిని విడిపించేందుకు.. హర్కత్‌ ఉగ్రవాదులు.. కొంత మంది విదేశీయులను ఢిల్లీ నుంచి కిడ్నాప్‌ చేశారు. అనంతరం మసూద్‌ను విడుదల చేయాల్సిందిగా డిమాండ్‌ చేశారు. కానీ ఆ సమయంలో ఉగ్రవాది ఒమర్‌ షేక్‌ పోలీసుల చేతికి చిక్కడంతో వారి ప్రయత్నం విఫలమైంది. దీంతో 1999లో మరోసారి ప్రయత్నించి... ఖాట్మండు నుంచి ఢిల్లీ వస్తున్న భారత విమానాన్ని హైజాక్‌ చేయడం ద్వారా మసూద్‌ను విడిపించుకున్నారు. ఇక ఆనాటి నుంచి మసూద్‌ కశ్మీర్‌లోని భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రదాడులు రచిస్తున్న సంగతి తెలిసిందే.(మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు)

చదవండి : ఉగ్రవాది ఆదిల్‌కు శిక్షణ ఇచ్చింది అతడే!

ఉగ్ర మారణహోమం

రివేంజ్‌ తీర్చుకునేందుకు టైమ్‌, ప్లేస్‌ డిసైడ్ చేయండి..

‘పాక్‌.. మాకు అత్యంత ప్రియమైన దేశం’ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement