మహిళల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు
లక్నో: యూపీలో మహిళలపై దాడులు, అత్యాచారాలకు తెగబడుతున్న దుండగులను శిక్షించేందుకు త్వరలతో పాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ఉన్నతాధికారి శనివారం లక్నోలో వెల్లడించారు. జిల్లాకు ఒకటి చొప్పున రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాలలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం సీఎం అఖిలేష్ యాదవ్ అధ్యక్షత జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టిన... రాష్ట్రంలో మహిళలపై నానాటికి దాడులు, అత్యాచార ఘటనలు... పెరిగిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు, నిందితులకు శిక్షలు పడేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని అఖిలేష్ ప్రభుత్వం భావించింది. అందుకు అనుమతి కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కి లేఖ రాసింది. ప్రభుత్వ లేఖపై సీజేఐ సానుకూలంగా స్పందించారు. దాంతో యూపీలో త్వరలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫాస్ట్ కోర్టుల కోసం ఏడాదికి రూ. 15.15 కోట్లు ఖర్చు అవుతుందని ఉన్నతాధికారి తెలిపారు. అయితే రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 5 తాత్కాలిక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను పర్మినెంట్ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని వెల్లడించారు.