
మాజీ ఉపముఖ్యమంత్రిపై ఎఫ్ఐఆర్
పట్నా: బిహార్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు తాయిలాలు ప్రకటించి సాక్షాత్తు రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ అడ్డంగా బుక్కయ్యారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఓటర్లకు ఉచిత కానుకలను ప్రకటించి వారిని మభ్యపెట్టి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయనపై మంగళవారం కేసు నమోదైంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో భబువా జిల్లాలో సోమవారం ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సభలో ప్రసంగించిన మాజీ ఉపముఖ్యమంత్రి లాప్టాప్లు, కలర్ టీవీలు, చీరలు ఇస్తామంటూ బహిరంగంగా ప్రకటించేశారు. దీంతో ఓటర్లను ప్రలోభ పెట్టారని ఆరోపిస్తూ సుశీల్ కుమార్ మోదీపై జిల్లా అధికారులు కేసు బుక్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్ 12, నవంబర్ 5వ తేదీల్లో 243 సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.