న్యూఢిల్లీ: దీపావళి పండుగను ధూంధాం ధమాకాగా చేద్దామని ప్లాన్ చేస్తున్నారా? ఇప్పటి నుంచే టపాసుల కొనుగోలు ప్రారంభించారా? వెలుగులు చిమ్మే చిచ్చుబుడ్లు, వీధివీధంతా మార్మోగే లక్ష్మీబాంబులు, వరుస పేలుళ్ల లడీలు.. ఇలా ఏమేం కొనాలో లిస్ట్ రెడీ చేసుకుంటున్నారా? కాస్త ఆగండి. ఈ దీపావళిని మీరలా జరుపుకోవడం సాధ్యం కాకపోవచ్చు. దీపావళే కాదు.. రానున్న క్రిస్మస్, న్యూఇయర్ పండుగలనూ పేలుళ్లతో కాదు.. ప్రశాంతంగా జరుపుకోవాల్సిందే. ఎందుకంటే పండుగ రోజు భారీగా విస్తరించే వాయు కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలను, మరికొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.
దీపావళి తదితర పండుగల సందర్భంగా బాణసంచా పేలుళ్లను పూర్తిగా నిషేధించలేదు కానీ కొన్ని పరిమితులు విధించింది. తక్కువ వాయు కాలుష్యాన్ని వెదజల్లే బాణాసంచా (గ్రీన్ క్రాకరీ)ను మాత్రమే వినియోగించాలంది. అలాగే, దీపావళి నాడు రోజంతా కాకుండా, కేవలం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు.. అంటే కేవలం రెండు గంటల పాటే పటాసులు కాల్చేందుకు అనుమతినిచ్చింది.క్రిస్మస్, న్యూఇయర్‌లు అర్ధరాత్రి పండుగలు కాబట్టి, ఆ రోజుల్లో రాత్రి 11.55 నుంచి 12.30 వరకు, 35 నిమిషాల పాటు బాంబుల మోత మోగించవచ్చని పేర్కొంది.
ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో ఒకే దగ్గర అంతా టపాసులు పేల్చుకునే అవకాశం కల్పించే కమ్యూనిటీ ఫైర్ క్రాకింగ్’ను ప్రోత్సహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. వరుస పేలుళ్లు జరిపే లడీ తరహా బాణసంచా వినియోగాన్ని నిషేధించింది. వెలుగు, చప్పుడు తక్కువ వచ్చేలా ప్రమాదకర రసాయనాలను తక్కువగా వినియోగించి టపాసులను తయారు చేయాలని ఉత్పత్తిదారులను ఆదేశించింది. నిబంధనల మేరకు టపాసుల వినియోగం జరిగేలా చూడాల్సిన బాధ్యత స్థానిక పోలీసు అధికారిదేనని స్పష్టం చేసింది.
తయారీదారుల జీవించే హక్కుపై...
వాయు కాలుష్యానికి కారణమవుతున్న బాణాసంచా తయారీ, విక్రయాలపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను మంగళవారం జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం విచారించింది. బాణసంచా వినియోగంపై నిషేధం బదులు పరిమితులు విధించాలని తయారీదారులు ఈ సందర్భంగా న్యాయస్థానాన్ని అర్థించారు. వాయు కాలుష్యానికి బాణసంచాతో పాటు గాలి, ఉష్ణోగ్రతలు కూడా కారణమేనన్నారు. స్పందించిన ధర్మాసనం..130 కోట్ల దేశ ప్రజల ఆరోగ్య హక్కుతోపాటు బాణసంచా తయారీదారుల జీవించే ప్రాథమిక హక్కుకు భంగం వాటిల్లకుండా చూస్తామంది. సుప్రీం ఆదేశాల వివరాలు..
♦ బాణసంచాల నుంచి వెలువడే ధ్వని, పొగ ప్రమాణాలను పెట్రోలియం, ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్(పీఈఎస్‌వో, పెసో) ధ్రువీకరించాల్సి ఉంటుంది. వీటిల్లో వాడే రసాయనాలను కూడా పెసో నిర్దేశించిన మేరకే వినియోగించాలి. ఇలా ధ్రువీకరించిన, గ్రీన్ క్రాకర్స్‌ను మాత్రమే ఉత్పత్తికి, విక్రయాలకు అనుమతించాలి. నిబంధనలను ఉల్లంఘించిన విక్రేతల లైసెన్స్‌లను పెసో రద్దు చేయవచ్చు.
♦ లైసెన్స్ పొందిన విక్రేతలే టపాసులను విక్రయించాలి. కోర్టు ఆదేశాలకు లోబడి తయారైన వాటిని మాత్రమే వారు అమ్మాల్సి ఉంటుంది. లేకుంటే లైసెన్స్ రద్దు తప్పదు.
♦ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ సంస్థలు బాణాసంచాను విక్రయించరాదు.
♦ పరిమితికి మించి ధ్వని, కాలుష్య కారకాలను వెదజల్లే బాణసంచాను కాల్చకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు శాఖదే. ఉత్స వాలు, పెళ్లిళ్ల సందర్భంగా వాడే బాణసంచా కూడా ప్రమాణాలకు లోబడి ఉండాలి.
♦ గ్రీన్ బాణసంచా వల్ల వ్యర్థాల పరిమాణం 15 నుంచి 20 శాతం వరకు తగ్గుతుంది. గ్రీన్ క్రాకర్స్ వల్ల ధ్వనితో పాటు కాంతి తీవ్రత కూడా 30 నుంచి 35 శాతం వరకు తగ్గుతుంది. దీంతోపాటు గాలిలో కలిసి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్‌ల పరిమాణం కూడా గణనీయంగా పడిపోతుంది.
♦ భారీ వాయు, శబ్ద కాలుష్యం వచ్చే సిరీస్ క్రాకర్స్ లేక లారిస్(ఎత్తుకు వెళ్లి పేలడంతోపాటు మిరుమిట్లు గొలిపే కాంతిని వెదజల్లే)తయారీ, విక్రయాలపై నిషేధం.
రివ్యూ పిటిషన్ వేస్తాం
సుప్రీం తీర్పుపై భిన్న స్పందనలు వెలువడ్డాయి. ఈ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని బాణసంచా తయారీ దారులు పేర్కొన్నారు. గ్రీన్ క్రాకరీ అనేదే లేదని, అలాంటి బాణసంచాను తయారు చేసేందుకు చాలా సమయం పడ్తుందని తెలిపారు. ఇప్పుడు తమ వద్ద ఉన్నది రెండేళ్లనాటి స్టాక్ అని చెప్పాయి. రెండు గంటల పాటే బాణసంచా పేలుళ్లకు అవకాశమివ్వడం వల్ల తమ బిజినెస్ భారీగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
తమిళనాడులోని శివకాశీలోనే దాదాపు 6 లక్షల మంది బాణసంచా తయారీతో ఉపాధి పొందుతున్నారని, అలాంటి వారి జీవనోపాధి సుప్రీంకోర్టు తీర్పుతో దెబ్బతింటుందని పేర్కొంది. మరోవైపు బాణసంచా పేలుళ్లతో వెలువడే వాయు, ధ్వని కాలుష్య స్థాయిలను కొలిచే పరికరాలు తమ వద్ద లేవని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అంతేకాకుండా, బాణసంచా విక్రేతలు సుప్రీంకోర్టు పేర్కొన్న పరిమితులలోపుఉన్న ఉత్పత్తులనే విక్రయించేలా చూడటం కూడా ఆచరణ సాధ్యం కాదన్నారు. కాగా, సుప్రీం తీర్పును పర్యావరణవేత్తలు స్వాగతించారు.
Comments
Please login to add a commentAdd a comment