తొలి ఎఫ్‌ఐఆర్‌కు 156 ఏళ్లు!
న్యూఢిల్లీ: ఏ నేరం జరిగినా దానిని పోలీసులు నమోదు చేసేది ఎఫ్‌ఐఆర్‌లోనే. అయితే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌గా పిలిచే ఈ ఎఫ్‌ఐఆర్‌కు భారత శిక్షాస్మృతిలో ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే దేశ రాజధాని ఢిల్లీలో తొలి ఎఫ్‌ఐఆర్ నమోదై 156 ఏళ్లు పూర్తయింది. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 156 ఏళ్ల క్రితం నార్త్ ఢిల్లీలోని సబ్జి మండి పోలీస్ స్టేషన్‌లో మొయునుద్దీన్ అనే వ్యక్తి తొలి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇది ఉర్దూలో ఉంది.
1861 అక్టోబరు 18న కట్ర షీస్ మహల్ ప్రాంతానికి చెందిన మొయుద్దీన్ తన ఇంట్లో వంటకు సంబంధించిన మూడు పెద్ద, మూడు చిన్న పాత్రలు, ఒక బౌల్, హుక్కా, మహిళలకు సంబంధించిన దుస్తులు, చోరీకి గురైనట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అప్పట్లో వీటి విలువ రూ.2.81(45 అణాలు). తాజాగా ఢిల్లీ పోలీసులు ఇందుకు సంబంధించిన ఫొటోని ట్విటర్‌లో ఉంచి ‘ఢిల్లీ పోలీసుల చరిత్రలో ఎంతో అరుదైనది’ అని పేర్కొన్నారు. 2014లో ఈ ఎఫ్‌ఐఆర్‌కు ఫ్రేమ్ కట్టించి ఢిల్లీలోని పోలీసు మ్యూజియంలో భద్రపరిచారు.