
శనివారం మెయిన్ పురిలో ఓటేశాక గుర్తింపు కార్డులను చూపిస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన భార్య డింపుల్
3 లోక్‌సభ, 33 అసెంబ్లీ స్థానాలకు ముగిసిన పోలింగ్
- 16న ఓట్ల లెక్కింపు ప్రక్రియ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. పది రాష్ట్రాల్లోని 3 లోక్‌సభ, 33 అసెంబ్లీ స్థానాలకు శనివారం పోలింగ్ జరిగింది. తెలంగాణలోని మెదక్, గుజరాత్‌లోని వడోదర, ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి ఎంపీ స్థానాలతోపాటు యూపీలో 11, గుజరాత్‌లో తొమ్మిది, రాజస్థాన్‌లో నాలుగు, పశ్చిమ బెంగాల్‌లో రెండు, ఈశాన్య రాష్ట్రాల్లో ఐదు, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లోని ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి.
వడోదర లోక్‌సభ స్థానానికి 49 శాతం, మెయిన్‌పురిలో 56 శాతం పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి యూపీలో 53 శాతం, గుజరాత్‌లో 49 శాతం, రాజస్థాన్‌లో 66 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమబెంగాల్‌లోని రెండు అసెంబ్లీ స్థానాల్లో భిన్నమైన పోలింగ్ సరళి కనిపించింది. బసీర్‌హత్ దక్షిణ్ స్థానానికి 79.59 శాతం పోలింగ్ నమోదైతే.. ఛౌరింగి స్థానానికి 47.13 శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో 50 శాతం, అస్సాంలో 70 శాతం, త్రిపురలో 87 శాతం పోలింగ్ నమోదైంది. ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 16న జరగనుంది.
కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు పూర్తయిన నేపథ్యంలో జరుగుతున్న రెండో ఉప ఎన్నికలివీ. కొద్దిరోజుల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీయడంతో ఈ ఎన్నికలు ప్రధాని నరేంద్రమోడీ ప్రజాదరణకు పరీక్షే. దీంతో ఈసారి సత్తా చాటేందుకు కమలదళం తీవ్రంగా శ్రమించింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఉప ఎన్నికల్లో లోక్‌సభ ఎన్నికల మ్యాజిక్ పునరావృతం చేస్తామని బీజేపీ నేతలు చెపుతున్నారు.అయితే యూపీలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు కమలనాథులకు గట్టిపోటీని ఇస్తున్నాయి.
లోక్‌సభ ఎన్నికల సమయంలో రెండు చోట్ల గెలిచిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ మెయిన్‌పురి నియోజకవర్గానికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది. అటు గుజరాత్‌లో మోడీ స్థానంలో ముఖ్యమంత్రి పగ్గాలు అందుకున్న ఆనందీబెన్ పటేల్ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు.