రూడీ రాజీనామా, మరో ఐదుగురు కూడా..
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ప్రధాని మోదీ చైనా పర్యటనకు ముందే సెప్టెంబర్ 2 సాయంత్రం కేబినెట్ విస్తరణ ఉండొచ్చని తెలుస్తోంది. కేబినెట్‌లో మార్పులు చేర్పులకు వీలుగా గురువారం రాత్రి కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పరిశ్రమల శాఖ(స్వతంత్ర హోదా) మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ రాజీనామా సమర్పించారు. రాజీనామా చేసిన వారిలో జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి కల్‌రాజ్ మిశ్రా, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రులు సంజీవ్ బలియాన్, మహేంద్ర పాండే కూడా ఉన్నారని తెలుస్తోంది.
మరోవైపు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మరో 8 మంది కేంద్ర మంత్రుల్ని కలిసి కేబినెట్ విస్తరణపై చర్చించారు. అనంతరం ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బిహార్‌కు చెందిన జేడీయూకు కేబినెట్‌లో చోటు కల్పించేందుకే రూడీ రాజీనామా చేసినట్లు సమాచారం. రూడీకి పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా కేబినెట్ విస్తరణలో జేడీయూతో పాటు అన్నాడీఎంకేకి కూడా చోటు కల్పించనున్నట్లు సమాచారం. అనారోగ్య కారణాలతో ఉమాభారతి రాజీనామా సమర్పించినట్లు భావిస్తున్నారు. పాండే యూపీ బీజేపీ చీఫ్‌గా నియమితులవడంతో ఆయన కూడా రాజీనామా చేశారని తెలుస్తోంది.
ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌లో రక్షణ, పట్టణాభివృద్ధి, సమాచార, ప్రసార శాఖ, పర్యావరణ శాఖలకు పూర్తి స్థాయి మంత్రులు లేరు. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా ఎన్నికవడం, అనిల్ దవే మరణం, మనోహర్ పరీకర్ గోవా సీఎంగా వెళ్లడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. పునర్వ్యవస్థీకరణలో భాగంగా విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు, వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్‌ల శాఖల మార్పు జరగొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కారీకి రైల్వే శాఖ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.