30మంది చనిపోయినా డిస్ట్రబ్ అవ్వను
లక్నో: అయోధ్యలో కరసేవకులపై జరిగిన కాల్పుల ఘటనను సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సమర్థించుకున్నారు. 30మంది ప్రాణాలుపోయినా సరే దేశ రక్షణ, ఐక్యత కోసం తాను చేసిన చర్యలను డిస్ట్రబ్ చేయలేవని అన్నారు. నాడు కరసేవకులపై కాల్పులు జరిపించిన మానవత్వ హంతకుడు ములాయం సింగ్ అని బీజేపీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ చేసిన ఆరోపణలు ఆయన కొట్టి పారేశారు. వాస్తవానికి నాడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న తాను అయోధ్యలో కాల్పులు జరపాలని ఆదేశించలేదని చెప్పారు.
అయినప్పటికీ తాను ఆ ఫలితాన్ని ఇప్పటికీ అనుభవించాల్సి వస్తుందని చెప్పారు. ఆ సంఘటన జరిగిన తర్వాత తాను ఎప్పుడు అయోధ్యవైపు వెళ్లినా చాలామంది రాళ్లు విసరడం, తుపాకులు గురిపెట్టి కాల్చడంలాంటివి చేశారని ములాయం చెప్పారు. విశ్వహిందూ పరిషత్ ఇచ్చిన పిలుపు మేరకు 1990 అయోధ్యలో రామమందిరం నిర్మాణం చేపట్టేందుకు పెద్ద సంఖ్యలో కరసేవకలు వచ్చారు. ఈ క్రమంలో వారిని నియంత్రించే క్రమంలో జరిపిన కాల్పుల్లో 16మంది ప్రాణాలుకోల్పోయారు. ఇదిలా ఉండగా.. తాను అయోధ్యలో కాల్పులకు ఆదేశించడం కొంత బాధాకరమని, కానీ, మత ప్రాధాన్య స్థలాన్ని రక్షించేందుకు తనకు ఆ పరిస్థితుల్లో అలా ఆదేశించక తప్పలేదని వివరించారు.