భారత్‌ నుంచి 12 లక్షల కోట్లు వెనక్కి | Foreign Investors Pull out USD 16 Billion From India | Sakshi
Sakshi News home page

భారత్‌ నుంచి 12 లక్షల కోట్లు వెనక్కి

Published Wed, May 20 2020 2:03 PM | Last Updated on Wed, May 20 2020 2:12 PM

Foreign Investors Pull out USD 16 Billion From India - Sakshi

న్యూఢిల్లీ : ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తన విశ్వరూపం చూపడం ప్రారంభించింది. అభివృద్ధి చెందిన దేశాలతోపాటు వర్ధమాన దేశాలు, పేద దేశాలపై కూడా కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రంగానే ఉంది. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు ఉన్నప్పటికీ పలు దేశాల నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కి పోతున్నాయి. అలా ఆసియా దేశాల నుంచి ఇప్పటి వరకు 26 బిలియన్‌ డాలర్ల (దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలు) విదేశీ పెట్టుబడులు వెనక్కి పోగా, ఒక్క భారత్‌ నుంచి 16 బిలియన్‌ డాలర్లు (దాదాపు 12.12 లక్షల కోట్ల రూపాయలు) వెనక్కి వెళ్లిపోయినట్లు అమెరికాలోని స్వతంత్ర పరిశోధన సంస్థ ‘కాంగ్రెషనల్‌ రిసెర్చ్‌ సెంటర్‌’ ఓ నివేదికలో వెల్లడించింది.

కరోనా ప్రభావం ఏయే దేశాలపై ఎలా ఉందో తెలియజేస్తూ ఆ సంస్థ ‘గ్లోబల్‌ ఎకనామిక్‌ ఎఫెక్ట్స్‌ ఆఫ్‌ కోవిడ్‌–19’ పేరిట ఓ నివేదికను వెల్లడించింది. యూరోజోన్‌ ఎకానమీ 3.8 శాతం కుంచించుకుపోయింది. 1995 నుంచి యూరోజోన్‌ ఎకానమి తగ్గుతూ వస్తున్నప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో పడి పోవడం మాత్రం ఇదే మొదటిసారి. అలాగే కోవిడ్‌ కారణంగా అమెరికా జీడీపీ రేటు మొదటి త్రైమాసికంలోనే 4.8 శాతం పడి పోయింది. 2008లో వచ్చిన ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత జీడీపీ రేటు పడి పోవడం ఇదే మొదటి సారి. మార్చి మధ్యకాలం నుంచి ఏప్రిల్‌ నెల చివరి నాటికి దాదాపు మూడు కోట్ల మంది అమెరికన్లు నిరుద్యోగ బీమా తీసుకున్నారని నివేదిక పేర్కొంది.

2020–21 సంవత్సరానికి భారత దేశం జీడీపీ వృద్ధి రేటును అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) తొలుత 5.8 శాతంగా అంచనా వేయగా ఆ తర్వాత దాన్ని 1.9 శాతంగా సవరించుకుంది. కరోనా ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని సవరించాల్సి వచ్చింది. లేకపోతే చైనా, భారత్‌లు పురోభివృద్ధి దిశగా దూసుకుపోతాయని ఐఎంఎఫ్‌ ముందుగా అంచనా వేసింది.

చదవండి: కరోనాను కట్టడి చేసే సబ్బు సంగతులు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement