న్యూఢిల్లీ : దక్షిణాసియాలో భారత్ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన కారణంగా పొరుగు దేశాలకు సహాయం చేయాల్సిన ఆవశ్యకత ఉందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అభిప్రాయపడ్డారు. సార్క్(ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక) దేశాల్లోని కొన్నింటితో భారత్‌కు సమస్యలు ఉన్నాయని పాకిస్తాన్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నివసిస్తున్న భారతీయులకు ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించడంలో విదేశాంగ శాఖ వడివడిగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో ప్రవాస భారతీయుల సమస్యలను తీర్చడంలో సుష్మా స్వరాజ్ ఎనలేని చొరవ చూపారంటూ ప్రశంసించారు. ఆమె సారథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ స్వరూపమే పూర్తిగా మారిపోయిందని ప్రశంసలు కురిపించారు.
పాకిస్తాన్‌కు అదొక హెచ్చరిక!!
ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి బిమ్స్‌టెక్(బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్) దేశాధినేతలు హాజరైన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి జైశంకర్ మాట్లాడుతూ.. ‘ బిమ్స్‌టెక్ దేశాధినేతలకు ఆహ్వానం పలకడం ద్వారా పాకిస్తాన్ స్పష్టమైన సందేశమిచ్చాం. ఉగ్రవాదంతో పాటు సార్క్ దేశాలతో సరిహద్దు, వ్యాపార సంబంధ సమస్యలు ఉన్నాయి. అయితే తమతో పాటు పొరుగుదేశాల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు పాటుపడటం భారత్‌కు ఉన్న గొప్ప స్వభావం. అందుకే ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక ఆసియాలో జాతీయవాదం అంటే ఎన్నికలు, రాజకీయాలకు అతీతంగా ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. కానీ ప్రపంచదేశాల్లో ఇందుకు వేరే అర్థం ఉంటుంది. కేవలం అధికారం చేజిక్కుంచుకునేందుకే ఈ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తుతారు’ అని వ్యాఖ్యానించారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఏకపక్ష విజయం గురించి మాట్లాడుతూ.. విదేశాంగ విధానం, అభివృద్ధి కార్యక్రమాల వల్లే అఖండ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. కాగా విదేశాంగ శాఖ ముఖ్య కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తించిన జైశంకర్‌కు ప్రధాని మోదీ తన కేబినెట్‌లో స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త్వరలోనే ఆయనను రాజ్యసభకు పంపేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment