బెడ్ షీట్లే తాళ్లుగా బాలనేరస్తుల పరారీ
గట్టిగా కొలిస్తే ఐదున్నర అడుగుల ఎత్తైనాలేని నలుగురు బాలనేరస్తులు.. 10 అడుగుల గోడ దూకి జువెనైల్ హోమ్ నుంచి పరారైన సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో చోటుచేసుకుంది. గతేడాది సంచలన రీతిలో ఒకేసారి 91 మంది బాలనేరస్తులు పారిపోయింది కూడా ఇదే వసతి గృహం నుంచి కావడం గమనార్హం.
బెడ్ షీట్లు, బ్లాంకెట్లను తాళ్లుగా మలిచిన బాలనేరస్తులు గురువారం రాత్రి వసతి గృహం గోడదూకి పారిపోయారని, ఆ గోడ ఎత్తు10 అడుగులని నిర్వాహకులు చెప్పారు. పరారీ విషయం తెలుసుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాలనేరస్తుల కోసం వేట ప్రారంభించారు. కాగా, గతేడాది హోమ్ నుంచి తప్పించుకున్న91 మంది జువెనైల్స్ లో 80 మంది పోలీసులకు చిక్కగా.. మరో 11 మంది ఇప్పటికీ పట్టుబడలేదు. ఇంతలోనే మరోసారి బాలనేరస్తులు పారిపోవటంతో వసతి గృహం నిర్వాహకులపై ఉన్నతాధికారులు మండిపడుతున్నారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు మీరట్ జిల్లా పోలీసు అధికారి పుష్పేంద్ర సింగ్ తెలిపారు.