పిట్ట కన్ను మినహా మరేదీ కనిపించనంతటి ఏకాగ్రత పాండవ మధ్యముడిదైతే... గిరిజనుడిగా పుట్టినా, మట్టిబొమ్మలోనే గురువును ఆవాహన చేసి విలువిద్యలో సాటిలేని మేటిగా నిలిచిన పట్టుదల ఏకలవ్యుడిది...! భావి భారత పౌరులను కూడా ఇదే తరహాలో సానపెట్టడమే లక్ష్యమని పేర్కొన్నారు జైట్లీ. గిరిజనుల కోసం ఏకలవ్య గురుకుల పాఠశాలలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. విద్యా రంగానికి కేటాయింపులు కూడా భారీగా చేశారు...
న్యూఢిల్లీ
కేంద్ర బడ్జెట్‌లో విద్యారంగం అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ రంగానికి రూ.85,010 కోట్లు కేటాయిస్తున్నట్లు వివరించారు. ఇందులో రూ.35,010 కోట్లు ఉన్నత విద్యారంగానికి, రూ.50,000 కోట్లు పాఠశాల విద్యకు కేటాయించామన్నారు. వచ్చే నాలుగేళ్లలో ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధనలను ప్రోత్సహించడానికి, మౌలిక సదుపాయాలు కల్పించడానికి రూ.లక్ష కోట్లతో ‘రివైటలైజింగ్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ సిస్టమ్ ఇన్ ఎడ్యుకేషన్(రైజ్) పేరిట ప్రత్యేక పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. హయ్యర్ ఎడ్యుకేషన్ ఫండింగ్ ఏజెన్సీ ద్వారా ఈ నిధులు కేటాయిస్తామన్నారు. ‘ప్రధానమంత్రి ఫెలోషిప్ పథకం’కింద ప్రతిఏటా ప్రముఖ విద్యాసంస్థల నుంచి అత్యంత ప్రతిభావంతులైన 1,000 మంది బీటెక్ విద్యార్థులను గుర్తించి, వారికి ఐఐటీలు, ఐఐఎస్సీలో పీహెచ్‌డీ చేసే అవకాశం కల్పిస్తామన్నారు. అంతేకాకుండా ఆకర్షణీయమైన ఉపకార వేతనం అందజేస్తామని తెలిపారు.
24 కొత్త మెడికల్ కాలేజీలు
దేశంలో వైద్యుల–రోగుల నిష్పత్తిలో అంతరాన్ని పూరించేందుకు 24 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు అరుణ్ జైట్లీ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న జిల్లా ఆసుపత్రుల స్థాయిని పెంచుతూ ఈ కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు కనీసం ఒకటి చొప్పున మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.
బ్లాక్ బోర్డుల నుంచి డిజిటల్ బోర్డులకు..
వడోదరలో స్పెషలైజ్డ్ రైల్వే యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు అరుణ్ జైట్లీ ప్రకటించారు. అలాగే పూర్తిస్థాయిలో రెండు కొత్త ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాకుండా ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో స్వయం ప్రతిపత్తి కలిగిన 18 ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ స్కూళ్లను నెలకొల్పనున్నట్లు తెలిపారు. విద్యారంగంలో నాణ్యత నానాటికీ పడిపోతోందని జైట్లీ ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలను పాఠశాలలకు రప్పించగలుగుతున్నాం కానీ వారికి నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నామని చెప్పారు. పాఠాలు బోధించే ఉపాధ్యాయుల్లో నాణ్యత పెరిగితే విద్యలోనూ నాణ్యత తప్పనిసరిగా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయుల కోసం సమీకృత బీఈడీ కోర్సులను ప్రవేశపెడతామన్నారు. 13 లక్షల మందికిపైగా టీచర్లకు శిక్షణ ఇస్తామన్నారు. ఇటీవల ప్రారంభించిన ‘దీక్షా’పోర్టల్ ద్వారా ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలను పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. విద్యారంగంలో డిజిటల్‌కు ప్రాధాన్యం పెరగాల్సి ఉందని వివరించారు. బ్లాక్ బోర్డుల నుంచి డిజిటల్ బోర్డుల వైపు వెళ్లాలని సూచించారు. 50 శాతానికి పైగా గిరిజన జనాభా గల ప్రాంతాలు లేదా 20 వేల గిరిజన జనాభా ఉన్న ప్రతిచోట నవోదయ విద్యాలయాల తరహాలో 2022 నాటికి ‘ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు’ఏర్పాటు చేయనున్నట్లు జైట్లీ వెల్లడించారు.
విద్య, వైద్యం సెస్సు 4 శాతానికి పెంపు
వ్యక్తిగత ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్నులపై 3 శాతంగా ఉన్న విద్య సెస్సును ‘విద్య, వైద్యం సెస్సు’కింద 4 శాతానికి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. పేద, గ్రామీణ కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ పెంపు ద్వారా రూ.11 వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
బడ్జెట్ హైలైట్స్
► 2018–19లో ఎస్సీల సంక్షేమానికి రూ.56,619 కోట్లు.. ఎస్టీల సంక్షేమానికి రూ.39,135 కోట్లు కేటాయింపు.
► ముద్రా పథకం కింద రుణ లక్ష్యం రూ. 3 లక్షల కోట్లు.
► డిజిటల్ ఇండియా పథకానికి రూ. 3,073 కోట్లు కేటాయింపు.
► టెలికం రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 10 వేల కోట్ల కేటాయింపు.
► మౌలిక వసతుల రంగానికి ప్రాధాన్యత. రూ. 5.97 లక్షల కోట్లు కేటాయింపు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4.94 లక్షల కోట్లు కేటాయించిన ప్రభుత్వం.
► ప్రతి వ్యాపార సంస్థకు ఆధార్ తరహాలో గుర్తింపు సంఖ్య.
► 2018–19 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.80 వేల కోట్లు.
► గోల్డ్ పాలసీని రూపొందిస్తున్నట్టు ప్రకటన.
Comments
Please login to add a commentAdd a comment