అమిత్ షా
న్యూఢిల్లీ: ‘ఆర్థికమంత్రి జైట్లీ గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలోని పేదలు, రైతులు, మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలకు ఊతమిచ్చేలా ఉందని బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రశంసించారు. ‘గ్రామీణ, వ్యవసాయ రంగాలకు రికార్డు స్థాయిలో నిధుల కేటాయింపులతో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్లడంతో పాటు అద్భుతమైన వ్యవసాయాభివృద్ధి సాధ్యమవుతుంది. రైతుల పంటకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ను ప్రభుత్వం ఒకటిన్నర రెట్లు పెంచింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ఇది ధ్రువపరుస్తోంది. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సాధికారత కల్పించడంతో పాటు వారి సంక్షేమానికి ఈ న్యూ ఇండియా బడ్జెట్ దోహదం చేస్తుంది’అని షా ట్వీటర్‌లో వెల్లడించారు.
బడ్జెట్‌లో 2018–19 సంవత్సరానికి ముద్ర పథకం కింద రూ.3 లక్షల కోట్లు కేటాయించినందుకు ప్రభుత్వానికి షా ధన్యవాదాలు తెలిపారు. ఈ బడ్జెట్ రైతులు, గ్రామీణ రంగం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేలా ఉందని పునరుద్ఘాటించారు. 2022 నాటికల్లా సరికొత్త భారతాన్ని ఆవిష్కరించాలన్న ప్రభుత్వ కల సాకారానికి, సమాజంలోని అన్ని వర్గాలు అభివృద్ధి ఫలాలు అందుకోవడానికి ఈ బడ్జెట్ దోహదం చేస్తుందని పేర్కొన్నారు.దాదాపు 10 కోట్ల మందికి ఆరోగ్య రక్షణ కల్పించే మోదీ కేర్ పథకానికి మంచి స్పందన వచ్చిందని వెల్లడించారు. స్వచ్ఛభారత్ కింద 2018–19లో 2 కోట్ల మరుగుదొడ్లు నిర్మించనున్నట్లు షా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment