
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో నాలుగేళ్ల క్రితం జరిగిన ఒక అత్యాచారం కేసులో ఓ తండ్రి, కొడుకులను నిర్దోషులుగా ప్రకటించిన సంఘటన ఆసక్తిని రేకెత్తిస్తోంది. బాధితురాలు నిందితుల కూతురు, సోదరి కావడం గమనార్హం. వివరాలు.. ఇలా ఉన్నాయి. సుమారు 10 మంది కుటుంబ సభ్యులతో ఒకే గది ఉన్న ఇంట్లో బాధితురాలు నివాసం ఉంటోంది. ఇందులోనే ఓ చిన్న కిరాణా కొట్టు కూడా నడుపుతున్నారు. 2015 ప్రాంతంలో తనకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన తండ్రి, సోదరుడు కొన్ని నెలలపాటు అత్యాచారం చేశారని, విషయం ఇతరులకు చెబితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ అంశంపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ ఆలస్యంగా దాఖలు చేయడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం.
ఈ కేసులో విచారణ చేపట్టిన ఢిల్లీ అదనపు సెషన్స్ కోర్టు మూడు కారణాలను చూపి ఫిర్యాదు చేసిన యువతి తండ్రి, సోదరుడిని నిర్దోషులుగా విడిచిపెట్టింది. ఎఫ్‌ఐఆర్ ఆలస్యంగా దాఖలు కావడం ఒక కారణమైతే, కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యాచారం జరగడం అసంభవమని కోర్టు అంచనాకు రెండో కారణం. విచారణ సమయంలో బాధితురాలు వేర్వేరు తేదీలు, నెలల పేర్లు చెప్పిందని, పైగా ఇతర కుటుంబ సభ్యులెవరూ బాధితురాలి పక్షాన విచారణలో పాల్గొనకపోవడాన్ని బట్టి కూడా ఆ యువతి చెప్పేది నిజం కాకపోవచ్చునని కోర్టు భావించింది. ఆ యువతి అప్పుడప్పుడూ కిరాణా కొట్లో వ్యాపారం చేసేదని, తనను బయట ఎక్కడకూ పంపేవారు కాదన్న బాధితురాలి వాంగ్మూలానికి ఇది భిన్నమని కోర్టు చెప్పింది. కొనుగోళ్ల కోసం వచ్చిన వాళ్ల (ఎక్కువగా ఇరుగుపొరుగు కావచ్చు)కు చెప్పుకున్నా ఎవరో ఒకరు సాయపడి ఉండేవారని కోర్టు పేర్కొంది.