
10 రోజుల్లో గాడినపెడతా: కేజ్రీవాల్
ఆ తర్వాతే సమస్యలను పరిష్కరిస్తా
ప్రజలకు తప్పుడు హామీలివ్వను
జనతా దర్బార్‌లో సీఎం కేజ్రీవాల్
ఘజియాబాద్: ఢిల్లీవాసుల సమస్యల పరిష్కారానికి తాను తప్పుడు హామీలు ఇవ్వనని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుత పాలనా వ్యవస్థను గాడిన పెట్టేందుకు తనకు వారం నుంచి పది రోజుల సమయం కావాలన్నారు. ఆ తర్వాతే ప్రజల సమస్యలు, కష్టాలను పరిష్కరిస్తానన్నారు. ఆదివారం కౌశాంబీలోని తన నివాసం వద్ద కేజ్రీవాల్ జనతా దర్బార్ నిర్వహించారు.
తనకు వినతిపత్రాలు సమర్పించేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడుతూ ‘మనం ఇప్పుడే అధికారం చేపట్టాం. పాలనా వ్యవస్థను గాడిన పెట్టి మీ సమస్యలను పరిష్కరించేందుకు కొంత సమయం...అంటే వారం నుంచి పది రోజులు పడుతుంది. నేను మీకు తప్పుడు హామీలు ఇవ్వను. పాలనా వ్యవస్థను గాడిన పెట్టాకే మీ వినతిపత్రాలు స్వీకరిస్తా’ అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ప్రజల మద్దతు తనకు అవసరమని...వారి సహకారం లేనిదే సమస్యలను పరిష్కరించలేనన్నారు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి తమను పర్మనెంట్ చేయాలని కోరేందుకు ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ)కు చెందిన సుమారు వెయ్యి మంది కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్లు, మున్సిపల్ కార్పొరేషన్ల కాంట్రాక్టు ఉద్యోగులు జనతా దర్బార్‌కు హాజరయ్యారు.
అధికారంలోకి వస్తే కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేస్తానని ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. కాగా, కేజ్రీవాల్ ఇంటి వద్దకు వచ్చే సందర్శకులను నియంత్రించేందుకు ఢిల్లీ, యూపీ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయన ఇంటి పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతను 10 మంది యూపీ పోలీసులు చేపట్టనుండగా అనుకోని అవాంతరాలను ఎదుర్కొనేందుకు ఢిల్లీ పోలీసులు సివిల్ దుస్తుల్లో కేజ్రీవాల్ ఇల్లు ఉన్న హౌసింగ్ సొసైటీ ప్రాంగణంలోనే ఉండనున్నారు. హౌసింగ్ సొసైటీ ప్రధాన ద్వారం వద్ద ఘజియాబాద్ పోలీసులు డోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేశారు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగా ఢిల్లీలో విద్యుత్ చార్జీలను 50 శాతం తగ్గించాలంటే ప్రభుత్వం నగదు సబ్సిడీ ఇవ్వడం మినహా మరో మార్గం లేదని విద్యుత్‌రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకుంటుంది: బీజేపీ
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ను అవినీతి పార్టీగా అభివర్ణించిన కేజ్రీవాల్ అధికారం కోసం అదే పార్టీ మద్దతు తీసుకోవడం వింతగా ఉందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రభాత్ ఝా విమర్శించారు. కాంగ్రెస్ ఎన్నడూ ఇతర పార్టీలకు ఐదేళ్లపాటు మద్దతివ్వలేదని గుర్తుచేశారు. అందువల్ల ఆప్ ప్రభుత్వానికి ఇచ్చిన మద్దతును కాంగ్రెస్ ఎప్పుడో అప్పుడు ఉపసంహరించుకుంటుందన్నారు.
అరవింద్ కేజ్రీవాల్, ఆప్, కాంగ్రెస్, ఢిల్లీ ముఖ్యమంత్రి, Arvind Kejriwal,AAP, Delhi chief minister