సాక్షి, ముంబై: నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రోడ్లపై నడుస్తున్న అన్ని వాహనాలను ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు వాహనాలలో గ్లోబల్ పొజిషినింగ్ సిస్టమ్ (జీపీఎస్)ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ప్రతి బస్సు, ట్యాక్సీ, ఆటోల కదలికలపై అధికారులు నిఘా ఉంచనున్నారు.
2012 డిసెంబర్‌లో ఢిల్లీలో నడుస్తున్న బస్సులో ఓ యువతిపై సామూహిక అత్యాచారం ఘటన నేపథ్యంలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు గాను మరిన్ని ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని వాహనాలకు జీపీఎస్‌ను అమర్చనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. రాష్ట్ర సమాచార సాంకేతిక విభాగం... పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లలో మరింత భద్రతను మెరుగు పరిచేందుకు అవసరమున్న పలు సూచనలతో తయారు చేసిన నివేదికను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు.
పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనను తాము పాటిస్తున్నామని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. సమాచార సాంకేతిక విభాగం తయారు చేసిన నివేదికను రవాణా శాఖకు సమర్పించనున్నామన్నారు. బెస్ట్, ఎమ్మెస్సార్టీసీ బస్సులు, బ్లాక్ అండ్ ఎల్లో ట్యాక్సీలు, ఆటోలలో ఈ జీపీఎస్‌ను అమర్చేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రిన్సిపల్ కార్యదర్శి (రవాణా) శైలేష్ శర్మ మాట్లాడుతూ.. ప్రతి కొత్త ట్యాక్సీలు, ఆటోల యజమానులు జీపీఎస్/ జీపీఆర్‌ఎస్ వ్యవస్థలను అమర్చుకునే విధానానికి అంగీకరించాలని, లేదంటే కొత్త పర్మిట్ పొందే సమయంలో ఆర్‌ఎఫ్‌ఐడీ ఛిప్‌లను అందజేస్తామన్నారు. ప్రస్తుతం నడుస్తున్న ట్యాక్సీలు, ఆటోలు తమ తమ వాహనాలకు ఆర్‌ఎఫ్‌ఐడీ, జీపీఎస్‌లను అమర్చుకుంటేనే వార్షిక ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇస్తారన్నారు. ఈ విధానంతోనైనా ఆటో,ట్యాక్సీ యజమానులు జీపీఎస్‌లను అమర్చుకుంటారని అధికారులు ఆశిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఈ జీపీఎస్‌తో అధికారులు ప్రతి వాహనంపై నిఘా ఉంచేందుకు సులువుగా ఉంటుంది. ప్రణాళిక ప్రకారం.. అన్ని ప్రజా వాహనాల్లో ఈ వ్యవస్థను అమర్చడం ద్వారా వాహనం ఎక్కడ ఉంది. వాహన వేగం, ఇతర వివరాలను కూడా పూర్తిగా తెసులుకునే వీలుంటుంది. అయితే ప్రభుత్వ ఆమోదం తర్వాతే ఈ వ్యవస్థ అమలుకు అవకాశముందని శైలేష్ శర్మ తెలిపారు. ఆరు నెలల్లోగా పూర్తి నివేదిక తయారవుతుందని ఆయన తెలిపారు. కాగా, వివిధ రవాణాదారులు, యూనియన్లు కూడా ఈ అంశంపై ఆసక్తిగా ఉన్నారన్నారు. వాహన డ్రైవర్ పేరు, ఫొటో, అతడు డ్రైవరా లేదా పర్మిట్ హోల్డరా తదితర వివరాలను వాహన బ్యాడ్జ్‌పై ముద్రించనున్నారు. అదేవిధంగా ఆర్టీవో హెల్ప్‌లైన్ నంబర్, ట్రాఫిక్ పోలీస్, మహిళల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను కూడా దీనిపై ముద్రించనున్నారు. అత్యవస సమయంలో ప్రయాణికులు ఈ నంబర్లను ఆశ్రయించాల్సి ఉంటుందని అధికారి తెలిపారు.
దీంతో జీపీఎస్ వ్యవస్థతో వాహనం ఎక్కడ ఏ ప్రాంతంలో ఉందో ఇట్టే పసిగట్టవచ్చు. ప్రస్తుతం ప్రజా రవాణాపై నిఘా ఉంచేందుకు 700 బెస్ట్ బస్సులు, మోనో, మెట్రో రైళ్లలో సీసీటీవీ కెమరాలను అమర్చిన విషయం తెలిసిందే.
రవాణాకు రక్షణ ‘బంధం’!
Published Sat, Jul 26 2014 10:34 PM | Last Updated on Sat, Sep 2 2017 10:55 AM
Advertisement
Advertisement