నీతి ఆయోగ్ సమావేశంలో సీఎంలు, గవర్నర్లు, ఉన్నతాధికారులనుద్దేశించి మాట్లాడుతున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: 2024 నాటికి దేశాన్ని 5 లక్షల కోట్ల డాలర్ల(సుమారు రూ.35 కోట్ల కోట్లు) విలువైన ఆర్థిక వ్యవస్థగా మార్చడం సాధించగల లక్ష్యమేనని ప్రధాని మోదీ అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రాలు స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)ని జిల్లా స్థాయి నుంచే పెంచేందుకు తమ శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించాలన్నారు. శనివారం ఆయన నీతి ఆయోగ్ ఐదో పాలక మండలి సమావేశాల్లో ప్రారంభోపన్యాసం చేశారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో తలెత్తిన కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పేదరికం, నిరుద్యోగం, కరువు, వరదలు, కాలుష్యం, అవినీతి, హింస తదితర సమస్యలపై సమష్టి పోరాటం సాగించాలని నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని పిలుపునిచ్చారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఆర్థిక వ్యవస్థ రెట్టింపు కావాలి
‘2019 మార్చి చివరికి దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2.75 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 2024 కల్లా దీనిని 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి మార్చడం కష్టమైనప్పటికీ సాధించగలిగిన లక్ష్యమే. జీడీపీని జిల్లా స్థాయి నుంచే పెంచేందుకు రాష్ట్రాలు తమ శక్తియుక్తులను ఉపయోగించాలి. దీంతోపాటు దేశీయ ఎగుమతులు భారీగా పెరగాల్సి ఉంది’అని మోదీ అన్నారు. ‘సాధికారిత, సులభ జీవనం ప్రతి భారతీయుడికి అందుబాటులోకి తేవాలి. స్వల్ప, దీర్ఘ కాలిక లక్ష్యాలను అధిగమించేందుకు ఉమ్మడిగా ముందుకు సాగాలి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉమ్మడిగా చేపట్టాల్సిన స్వచ్ఛ భారత్ అభియాన్, పీఎం ఆవాస్ యోజన ఇందుకు ఉదాహరణ’అని తెలిపారు. ‘మహాత్మాగాంధీ 150వ వర్థంతికి లక్ష్యంగా పెట్టుకున్న వాటిని అక్టోబర్ 2వ తేదీకి సాధించాలి, 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి నిర్దేశించుకున్న లక్ష్యాలను 2022 కల్లా అధిగమించేందు కృషి జరగాలి’ అని కోరారు.
పర్ డ్రాప్, మోర్ క్రాప్
‘దేశంలోని పలు ప్రాంతాల్లో కరువు వంటి పరిస్థితులున్నందున వీటిని ఎదుర్కొనేందుకు ప్రతి నీటి బొట్టుకు మరింత ఫలసాయం (పర్ డ్రాప్, మోర్ క్రాప్) విధానాన్ని అభివృద్ధి చేయాలి. 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకోసం చేపలపెంపకం, పశుపోషణ, ఉద్యానపంటలు, పూలు, కూరగాయల సాగు రైతులు చేపట్టేలా ప్రోత్సహించాలి. పీఎం–కిసాన్ వంటి రైతు పథకాలు సకాలంలో ఉద్దేశించిన రైతులకు అందాలి’అని సూచించారు. వ్యవసాయ రంగంలో కార్పొరేట్ పెట్టుబడులు, రవాణా సౌకర్యాలు, మార్కెట్ సదుపాయం కల్పించేందుకు కృషి జరగాలని ప్రధాని అన్నారు. ఆహారధాన్యాల ఉత్పత్తి కంటే ఫుడ్ ప్రాసెసింగ్ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ నినాదం సాధనలో నీతి ఆయోగ్ పాత్ర ఎంతో కీలకమన్నారు. అభివృద్ధి లక్షిత(అస్పిరేషనల్) 115 జిల్లాల్లో ఇంకా కొన్ని రంగాల్లో వెనుకబాటును అధిగమించేందుకు గుడ్ గవర్నెన్స్‌పై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రులను కోరారు.
హాజరుకాని ముగ్గురు సీఎంలు
కరువు పరిస్థితులు, వ్యవసాయ సంక్షోభం, వాన నీటి సంరక్షణ, ఖరీఫ్ పంటల సన్నద్ధత, అభివృద్ధి లక్షిత జిల్లాల పథకం, వ్యవసాయరంగంలో మార్పులు, వామపక్ష తీవ్రవాదం వంటి ఐదు ప్రధానాంశాలపై చర్చించేందుకు ఏర్పాటైన ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆర్థిక అధికారాలు లేని నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాబోనంటూ ఇటీవల ప్రధానికి లేఖ రాసిన బెంగాల్ సీఎం మమత బెనర్జీ రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం పనుల్లో బిజీగా ఉన్నందున తెలంగాణ సీఎం కేసీఆర్ రాలేదు. ఆరోగ్య సమస్యలతో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ రాలేదు.
కాంగ్రెస్ సీఎంలకు మన్మోహన్ నిర్దేశం
నీతి ఆయోగ్ సమావేశాల సందర్భంగా ప్రస్తావించాల్సిన అంశాలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్, రాజస్తాన్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరి సీఎంలు కమల్ నాథ్, అశోక్ గెహ్లోత్, కుమారస్వామి, భూపేశ్ బఘేల్, నారాయణ స్వామి హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment