సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో ప్రజలు ఎలా పోతే మనకేంటి, మనం బాగున్నామా లేదా? వరుస వర్షాలతో రాష్ట్రం, రాజధాని వణికిపోతున్నా పాలకులు మాత్రం సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అడుగేయాలంటే భయపడుతూ ప్రజలు గుంతల రోడ్లపై తిరుగుతుంటే ప్రభుత్వం ఆండబరాలకు పోతోంది. వర్షం వస్తే చాలు మురుగునీరు రోడ్లపై ఏరులై పారుతుంది. గుంతల రోడ్ల కారణంగా వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా రాష్ట్రం మొత్తం సమస్యలతో సతమతమౌతుంటే, ప్రభుత్వం వీటన్నింటినీ ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజా ప్రతినిధులకు బంగారు బిస్కెట్లు కానుకగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కర్ణాటక అసెంబ్లీ(విధాన సౌధా) నిర్మించి 60 ఏళ్లు కావొస్తోంది. ఇందులో భాగంగా 300మంది ప్రజాప్రతినిధులకు బంగారు బిస్కెట్లను కానుకగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం దాదాపు రూ.3కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతోంది. ముఖ్యమంత్రి నుంచి ఆమోదం రాగానే సభ్యులందరికీ ఈ బంగారు బిస్కెట్లను అందిస్తామని పేర్కొన్నారు.
అసెంబ్లీ సిబ్బందికి మాత్రం రూ.6వేలు విలువ చేసే వెండి వస్తువులను ఇవ్వాలని భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం కోసం ఈ నెల 25, 26న ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈకార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆహ్వానించే యోచనలో ఉన్నారు. అయితే ఈ విషయమై సిద్ధరామయ్య ఎలాంటి అనుమతులు జారీ చేయలేదని అధికారులు వెల్లడించారు.
అయితే ప్రభుత్వం తీరుపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. తీవ్ర వర్షాలతో రాష్ట్రం అల్లాడుతుంటే ప్రభుత్వం మాత్రం ఆడంబరాలకు పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నగరంలో రోడ్లు నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టకుండా బంగారు బిస్కెట్లు పంచుకోవడం ఏంటి? అంటూ ప్రశ్నిస్తున్నాయి.
ఆ వార్తలు అబద్ధం : స్పీకర్
తన చేతుల మీదుగా బంగారు కాయిన్లు, వెండి పళ్లాలు పంచబోతున్నారన్న వార్తలను అసెంబ్లీ స్పీకర్ కేబీ కొలివాదా ఖండించారు. ‘ ఆ వార్త పచ్చి అబద్ధం. అలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో కూడా తెలీటం లేదు’ అని ఆయన మీడియాతో అన్నారు. అయితే 26 కోట్ల రూపాయిలతో 19 రకాల వస్తువులను మాత్రం పంచబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆర్థిక శాఖకు ఓ ప్రతిపాదన పంపినట్లు ఆయన అంగీకరించారు.
లెక్కలు ఎలా ఉన్నాయంటే...
పూల అలంకరణకు 75 లక్షలు,
కాఫీ, టీల ఖర్చు కోసం 35 లక్షలు,
తిండి ఖర్చు 3 కోట్ల 75 లక్షలు,
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సాధించిన ఘనతలను ప్రత్యేక డాక్యుమెంటరీ రూపంలో ప్రదర్శించటం.. అందుకోసం 3 కోట్లు కేటాయించాలని నిర్ణయం.
Comments
Please login to add a commentAdd a comment