న్యూఢిల్లీ: పేదలపై పడుతున్న వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించి, అందుబాటు ధరల్లో అందరికీ ఆరోగ్య సంరక్షణ కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఆసుపత్రులు, వాటిలో పడకలు, వైద్యుల సంఖ్య పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రధాన్‌మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన(పీఎంబీజేపీ) లబ్ధిదారులతో మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్ సహా ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, పథకాలను వివరించారు.
త్వరలో దేశమంతా ఆయుష్మాన్ భారత్
‘పేదలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కొత్తగా 90కి పైగా మెడికల్ కళాశాలలను ప్రారంభించి, 15 వేల ఎంబీబీఎస్ సీట్లను పెంచాం. 50 కోట్ల మందికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా అందించే బృహత్ పథకం ఆయుష్మాన్ భారత్ తొలి దశ ప్రారంభమైంది. త్వరలోనే దేశమంతా అమల్లోకి వస్తుంది. పేదలపై వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు నాలుగేళ్లుగా ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించాం. ప్రతి భారతీయునికి చౌక ధరల్లో వైద్యం అందించేందుకు కృషిచేస్తున్నాం. సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వాటి ప్రయోజనాలు పేదలకు చేరుతున్నాయని చాలా సంతోషంగా చెబుతున్నా. ఔషధాలు పొందడం పేదలకు ఒక సమస్యగా మారింది. పీఎంబీజేపీ కింద వాటి ధరలు దిగొచ్చాయి.
దేశవ్యాప్తంగా నేడు సుమారు 3,600 జన ఔషధి కేంద్రాల్లో 700 రకాలకు పైగా జనరిక్ మందులు అందుబాటులో ఉన్నాయి. డయాలిసిస్ సేవల ఖర్చును తగ్గించేందుకు ప్రారంభించిన ప్రైమ్‌మినిస్టర్ రాష్ట్రీయ డయాలిసిస్ యోజన 80 శాతం జిల్లాల్లో అమలవుతోంది. 2030 నాటికి క్షయ వ్యాధిని నిర్మూలించాలని ప్రపంచం లక్ష్యంగా పెట్టుకుంది. దానికి 5 ఏళ్ల ముందే అంటే 2025 నాటికే దేశం నుంచి ఆ వ్యాధిని తరిమికొట్టడానికి కార్యాచరణ ప్రారంభించాం. 12 రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పించేందుకు ఇంద్రధనుష్ కార్యక్రమం కింద 3.15 కోట్ల మంది చిన్నారులు, 80 లక్షల మంది గర్భిణులకు టీకాలు వేయించాం. పరిశుభ్ర భారత్ సాకారం దిశగా స్వచ్ఛ్ భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా పారిశుధ్య కవరేజీ 38 శాతం నుంచి 80 శాతానికి పెరిగింది’ అని మోదీ అన్నారు.
జిన్‌పింగ్‌తో భేటీ కానున్న మోదీ..
షాంగై సహకార సంస్థ(ఎస్‌సీఓ) సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ శనివారం భేటీ కానున్నారు. గత నెలలో వుహాన్‌లో జరిగిన అనధికారిక సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై ఇద్దరు నేతలు సమీక్ష జరుపుతారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ వెల్లడించారు. ఎస్‌సీఓ కూటమికి చెందిన సుమారు ఆరుగురు దేశాధినేతలతో మోదీ చర్చించే వీలుంది. సదస్సుకు హాజరుకాబోతున్న పాక్ అధ్యక్షుడితో మోఈ భేటీపై ఇంకా స్పష్టత రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment