‘ముల్లై’ లక్ష్యం 152 అడుగులు
ముల్లైపెరియార్ డ్యామ్ నీటి మట్టాన్ని 152 అడుగులకు పెంచడమే తన లక్ష్యమని సీఎం జయలలిత స్పష్టం చేశారు. తమిళుల హక్కుల పరిరక్షణ, జీవనాభివృద్ధి, అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా అవిశ్రాంత ఉద్యమాలకు తాను సిద్ధమని ప్రకటించారు. మదురైలో శుక్రవారం జరిగిన ముల్లైపెరియార్ డ్యామ్ విజయోత్సవ సభలో సీఎంను రైతు సంఘాల నేతలు పొగడ్తలతో ముంచెత్తారు.
సాక్షి, చెన్నై : ముల్లైపెరియార్ డ్యామ్ నీటి మట్టాన్ని 142 అడుగులకు చేర్చే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు తగ్గ పనులు వేగవంతమయ్యాయి. ఈ విజయం ముఖ్యమంత్రి జే.జయలలిత నేతృత్వంలోని ప్రభుత్వ శ్రమకు ఫలితంగా చెప్పవచ్చు. జయలలితను సత్కరించే విధంగా, విజయోత్సవాన్ని జరుపుకునేందుకు ఆ డ్యామ్ నీటి ఆధారిత జిల్లాలు తేని, విరుదునగర్, శివగంగై, రామనాథపురం, మదురై, దిండుగల్ రైతు సంఘాలు నిర్ణయించాయి. ఇందు కోసం మదురై వేదికగా భారీ ఏర్పాట్లు చేశారు.
ఈ వేడుకలో పాల్గొనేందుకు శుక్రవారం మధ్యాహ్నం చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో మదురైకు వెళ్లారు. అక్కడ సీఎంకు పార్టీ వర్గాలు బ్రహ్మరథం పట్టాయి. ప్రత్యేక హెలీకాఫ్టర్‌లో మదురై పాండి కోవిల్‌రింగ్ రోడ్డులోని మైదానానికి చేరుకున్నారు. అక్కడ ముల్లై పెరియార్ డ్యామ్ నమూనాలో ఏర్పాటు చేసిన వేదికపై సీఎం జయలలితను రైతు సంఘాల నాయకులు, మంత్రుల బృందం అభినందనలతో ముంచెత్తింది. నిలువెత్తు పూల మాలను, విజయోత్సవానికి కానుకగా ముల్లైపెరియార్ నమూనాతో సిద్ధం చేసిన భారీ జ్ఞాపికను, వీర కత్తిని బహూకరించారు.
152 అడుగులే లక్ష్యం
తన ప్రసంగంలో ఇది అభినందన సభ కాదని, తమిళ ప్రజలు, అన్నదాతలు సాధించిన విజయోత్సవానికి ప్రతీక అని సీఎం జయలలిత అభివర్ణించారు. 37 ఏళ్ల పోరటానికి లభించిన విజయం 142 అడుగులకు నీటి మట్టం పెంచడం అని గుర్తుచేశారు. తమిళుల హక్కుల పరిరక్షణకు తాను అధికారంలో ఉన్నా, లేకున్నా, అహర్నిశలు శ్రమించినట్టు గుర్తుచేశారు. సుప్రీం కోర్టులో తమిళుల హక్కులు పరిరక్షించ బడ్డాయని వివరించారు. అయితే డీఎంకే హయాంలో తమిళుల హక్కులు కాలరాయడం లక్ష్యంగా, ఈలం తమిళులు సర్వనాశనం లక్ష్యంగా ప్రయత్నాలు జరిగాయని ధ్వజమెత్తారు. గత డీఎంకే ప్రభుత్వ పుణ్యమా అని కరుణానిధి వ్యక్తిగత స్వలాభం కారణంగా తమిళ ప్రజలు, రాష్ట్రం సంకట పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని మండిపడ్డారు.
కేంద్రంలోని కాంగ్రెస్ పాలకులు, రాష్ట్రంలోని డీఎంకే కలసికట్టుగా తమిళుల హక్కులన్నింటినీ తాకట్టుపెట్టే యత్నం చేశారని శివాలెత్తారు. తన ప్రభుత్వం అధికారంలోకి రాగానే చిత్త శుద్ధితో తేని, దిండుగల్, మదురై, శివగంగై, రామనాథపురం జిల్లాల ప్రజల జీవనాధారం లక్ష్యంగా, తన వ్యక్తిగత సమస్యగా ఈ డ్యామ్ వివాదాన్ని తీసుకోవడం జరిగిందన్నారు. అవిశ్రాంతంగా చేసిన ప్రయత్నాలకు ఫలితం దక్కిందని, 142 అడుగులకు నీటి మట్టం పెంపునకు కసరత్తులు జరుగుతున్నాయని వివరించారు. ఆనకట్టులు, డ్యామ్ తీరాన్ని మరింత బలపరచుకునే అవకాశాన్ని సుప్రీంకోర్టు తమిళనాడుకు ఇచ్చిందన్నారు.
ఈ ప్రక్రియ ముగియగానే, ఆ డ్యామ్ నీటి మట్టాన్ని 152 అడుగులకు చేర్చడం లక్ష్యంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రకటించారు. రాష్ట్ర ప్రజలు తనకు సంపూర్ణ సహకారం ఇచ్చారని, ఈ విజయంలో వారికి, అన్నదాతలకు భాగం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఓ పన్నీరు సెల్వం, నత్తం విశ్వనాథన్, సెల్లూరు కే.రాజు, గోకుల ఇందిర, సుందరరాజ్, ఆర్‌పీ ఉదయకుమార్, ఫార్వడ్ బ్లాక్ ఎమ్మెల్యే కదిరవన్, కంబం, పల్లతాక్కు, పెరియార్, వగైై, తమిళనాడు వ్యవసాయ సంఘాల నాయకులు వీ.కృష్ణమూర్తి, ఇవి అరుల్ ప్రకాశం, మదురై వీరన్, పనయూరు ఏ అలగు సెర్వై, ఆలత్తూరు గోవిందన్ తదితరులతో పాటుగా అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు, అన్నదాతలు తరలివచ్చారు.