మగాళ్లకు 180 రోజుల సెలవులు!
న్యూఢిల్లీ: సరోగసీ ద్వారా సంతానం పొందే దంపతులకు ప్రసూతి సెలవులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సర్వీసు నిబంధనలు మార్చాలని యోచిస్తోంది. సరోగసీ ద్వారా సంతానం పొందాలనుకునే మహిళా ఉద్యోగులకు 180 రోజులు ప్రెటర్నిటీ లీవు ఇవ్వాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్స్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ) ప్రతిపాదించింది. సరోగసీతో తండ్రులయ్యే పురుషులకూ ఆరు నెలలు ప్రెటర్నిటీ సెలవు ఇవ్వాలని సిఫారసు చేసింది.
'సరోగసీ ద్వారా సంతానం పొందే మహిళలకు లేదా అద్దెగర్భం మోసే తల్లులకు ప్రెటర్నిటీ సెలవులు ఇవ్వడం అనేది ఇప్పటివరకు సర్వీసు రూల్స్ లో లేదు. నవజాత శిశువులను కంటికి రెప్పలా చూసుకునేందుకు సరోగసీ దంపతులకు 180 సెలవులు ఇవ్వాలని ప్రతిపాదించామ'ని డీఓపీటీ పేర్కొంది. ప్రతిపాదిత నిబంధనలను డీఓపీటీ తన వెబ్ సైట్ లో పెట్టింది. వీటిపై అభిప్రాయాలు తెలపాలని కోరింది.
చైల్డ్ కేర్ లీవు(సీసీఎల్) నిబంధన సడలించాలని కూడా కేంద్రం ప్రతిపాదించింది. వికలాంగ చిన్నారుల సంరక్షణకు తల్లికి రెండేళ్లు(730 రోజులు) చైల్డ్ కేర్ లీవు ఇస్తున్నారు. అయితే సదరు చిన్నారి మైనారిటీ అయివుండాలన్న వయసు నిబంధనను సడలించాలని సిఫారసు చేసింది. సీసీఎల్ లో ఉన్నప్పుడు మహిళా ఉద్యోగులకు ప్రయాణ చార్జీల్లో రాయితీ ఇవ్వాలని కూడా ప్రతిపాదించింది.