ట్రాఫిక్ నిలిపారు.. ప్రాణం నిలిచింది
ట్రాఫిక్ నిలిపారు.. ప్రాణం నిలిచింది
Published Sun, Sep 3 2017 2:42 PM | Last Updated on Sun, Sep 17 2017 6:20 PM
-గ్రీన్‌కారిడర్‌తో అంబులెన్స్‌కు దారి
-ప్రజలకు హ్యాట్సాఫ్
సాక్షి, గువాహటి: ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు అల్లలాడిపోయే నగరాల్లో అస్సాం రాజధాని కూడా ఒకటి. సెలవు రోజుల్లో కూడా వాహనాలు ఒకదాని వెనుక నత్తనడకన సాగాల్సిందే. వీఐపీ వాహనాలు కూడా అందుకు మినహాయింపేం కాదు. అలాంటిది ఓ అంబులెన్స్ మాత్రం ఆదివారం ఉదయం రోడ్లపై రయిమని దూసుకుపోయింది. అందుకు కారణం అందులో ఓ ఆరేళ్ల ప్రాణం కొట్టుమిట్టాడటమే...
అస్సాం విశ్వనాథ్ చరియాలి ప్రాంతానికి చెందిన ఆరేళ్ల బాలుడు స్నిగ్ధారాగ్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. అతని ఊపిరితిత్తులు, వెన్నెముకలకు ఇన్‌ఫెక్షన్ సోకింది. దీంతో గువాహటిలోని ప్రతిక్ష ఆస్పత్రిలో రెండు నెలల క్రితం చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. వెంటిలేటర్‌పై ఉన్న అతనికి మెరుగైన వైద్యం కోసం ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. అతని ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆలస్యమయితే జరగరానిది ఏదైనా జరగొచ్చని వైద్యులు హెచ్చరించారు. దీంతో ఎయిర్ ఆంబులెన్స్ ద్వారా తరలించాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆస్పత్రి నుంచి లోకప్రియ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకునేందుకు దూరం 45 కిలోమీటర్లు.. సుమారు 90 నిమిషాల సమయం పడుతుంది. పైగా ట్రాఫిక్ సమస్య కూడా అధికం. దీంతో అధికారులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైపోయారు. అంటే ఆ రూట్‌లో వాహనాలను నిలువరింపజేసి ఆంబులెన్స్‌ను సాఫీగా సాగనంపుతారన్న మాట. మరి అందుకు ప్రజలు సహకరిస్తారా? అన్నదే అసలు ప్రశ్న. వెంటనే బాలుడి తల్లిదండ్రులు మీడియాను ఆశ్రయించారు. తమ బిడ్డ ప్రాణాలు కాపాడుకునేందుకు మార్గం సుగమం చేయాలని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో, టీవీల్లో ప్రకటనలు ఇచ్చారు. ప్రజలు సానుకూలంగా స్పందించటంతో ఆదివారం ఉదయం తరలించేందుకు సిద్ధమయ్యారు. ప్రత్యేక ఆంబులెన్స్ లో బాలుడిని ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్లారు. 90 నిమిషాల జర్నీ కేవలం 26 నిమిషాల్లోనే ముగిసింది. ఉదయం 11:50 నిమిషాలకు ఎయిర్ ఆంబులెన్స్ ఢిల్లీకి బయలుదేరింది. మధ్యాహ్నాంకల్లా గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉంది.
సకాలంలో స్పందించిన ప్రజలకు, మీడియాకు, పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఆ బాలుడి తల్లి మధుస్మిత. ‘ఆ బాలుడికి ప్రతీ క్షణం చాలా విలువైంది. ఆ పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే అత్యవసర పరిస్థితుల్లో దారిచ్చారు’ అని గువాహటి కమిషనర్ హిరెన్ చంద్రనాథ్ చెబుతున్నారు. వీవీఐపీ ట్రీట్‌మెంట్ పేరిట తరచూ ట్రాఫిక్‌ను అడ్డుకోవటం, కొన్ని ప్రాణాలు బలయిపోవటం లాంటి ఘటనలు ఇది వరకు చాలా చూశాం. కానీ, ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు అక్కడి ప్రజలు చూపిన చొరవను మాత్రం అభినందించకుండా ఉండలేకపోతున్నారు. ఇంతకు ముందు అస్సాంలోని ప్రధాని మోదీ చొరవతో ఓ చిన్నారిని ఇదే రీతిలో వైద్యం కోసం ఢిల్లీకి తరలించిన విషయం విదితమే.
Advertisement