ఏపీ భవన్లో తుపాకీ మిస్ఫైర్!
న్యూఢిల్లీ : ఢిల్లీ ఏపీభవన్లో ప్రమాదవశాత్తూ తుపాకీ మిస్ఫైర్ అయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోదావరి బ్లాక్లోని 404 గదిలో ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో తెలంగాణ ఇన్స్పెక్టర్ రవికిరణ్ గాయపడ్డారు. ఆయనను చికిత్స నిమిత్తం రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా రివాల్వర్ బెల్టును నడుముకు పెట్టుకున్న రవికిరణ్...సెల్ఫోన్ కిందపడటంతో దాన్ని తీసుకునే ప్రయత్నంలో కిందకు వంగారు. దీంతో ఒత్తిడికి గురై రివాల్వర్ పేలడంతో కాలికి గాయమైంది. గతంలో ఆయన తిరుమలగిరి సీఐగా పనిచేశారు. ప్రస్తుతం రవికిరణ్ సీసీఎస్ లో ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల క్రితం ఎన్ మిషన్ లో పాల్గొనేందుకు రవికిరణ్ ఢిల్లీ వెళ్లారు.ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.