
కోర్టులో గుర్మీత్ రామ్ రహీం సింగ్ (ఊహాచిత్రం)
రోహతక్: లైంగిక వేధింపుల కేసులో డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్‌కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం పదేళ్ల కఠిన కారాగార శిక్ష జైలు శిక్ష విధించింది. తీర్పు సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ జగదీప్ సింగ్ పలు అంశాలు ప్రస్తావించారు. ఇది క్షమించరాని నేరమని పేర్కొన్నారు. తనను నమ్మి వచ్చిన అమాయకులపై అత్యాచారానికి పాల్పడడం దారుణమని వ్యాఖ్యానించారు. గుర్మీత్ రాం రహీమ్ సింగ్‌కు జీవితఖైదు విధించాలని బాధితురాలు కోరినట్టు వెల్లడించారు. తనను క్షమించాలన్న గుర్మీత్ విజ్ఞప్తిని జడ్జి తోసిపుచ్చారు. గుర్మీత్‌ను సాధారణ ఖైదీలాగే చూడాలని ఆదేశించారు. అతడిని వీఐపీలాగా చూడటంతో పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపిస్ట్‌కు అదనపు సౌకర్యాలు కల్పిస్తారా అని చివాట్లు పెట్టారు.
కాగా, కోర్టు తీర్పుపై బాధితురాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. గుర్మీత్‌కు పదేళ్ల జైలు శిక్ష సరిపోదని అన్నారు. గుర్మీత్ సింగ్ చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని నిరపరాధిగా విడిచిపెట్టాలని లేదా శిక్షను తగ్గించాలని ఆయన తరపు న్యాయవాది చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించగానే గుర్మీత్ సింగ్ కోర్టులోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. కోర్టు హాలు నుంచి బయటకు రావడానికి నిరాకరించడంతో ఆయనను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి జైలుకు తరలించారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఖైదీ దుస్తులు ఇవ్వనున్నారు. తర్వాత జైల్లో సెల్ కేటాయిస్తారు.