కశ్మీర్ నుంచి కేసులు బదిలీ చేయొచ్చు
సుప్రీం కోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: వైవాహిక సంబంధ వివాదాలతోపాటు సివిల్, క్రిమినల్ కేసులను జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికిగానీ, అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకుగానీ బదిలీ చేసే అధికారం తనకుందంటూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పౌర శిక్షాస్మృతి (సీపీసీ), నేర శిక్షాస్మృతి(సీఆర్‌పీసీ) లాంటి కేంద్ర చట్టాలు ఆ రాష్ట్రానికి వర్తించనప్పటికీ న్యాయం పొందాలన్న కక్షిదారుల హక్కును పరిరక్షించడానికి కేసులను బదిలీ చేసే అసాధారణ అధికారం తమకుందని స్పష్టంచేసింది.
ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ బెంచ్ మంగళవారం తీర్పు ఇచ్చింది. ఆయా కేసుల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోరాదన్న ఆ రాష్ట్ర ప్రభుత్వ వాదనను తోసిపుచ్చుతూ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆదేశించే అధికారం ఈ కోర్టుకు ఉందని పేర్కొంది. ఆయా అంశాలపై సుప్రీంకోర్టుకు హక్కున్నట్లు స్థానిక చట్టాలైన జమ్మూకశ్మీర్ సీపీసీ, జమ్మూకశ్మీర్ సీఆర్‌పీసీల్లో లేదని ఆ రాష్ట్రం వాదించింది. జమ్మూకశ్మీర్‌లోని కోర్టులో తనకు న్యాయం జరగలేదని భావించి ఎవరైనా తమ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరినప్పుడు ఆ కోర్టు దాన్ని తిరస్కరిస్తే..
అప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం బదిలీకి ఆదేశించే అసాధారణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని పేర్కొంది. సందర్భానుసారంగా అధికరణాలు 32, 136, 142 ప్రకారం కేంద్ర సీపీసీ, సీఆర్‌పీసీలతో నిమిత్తం లేకుండా కేసుల బదిలీకి ఆదేశించే అధికారముంటుందని చెప్పింది. దీనికి సంబంధించి దాఖలైన పలు పిటిషన్లను ధర్మాసనం విచారించింది.
కశ్మీర్ స్వాతంత్య్రానికి హఫీజ్ సయీద్ యాత్ర
లాహోర్: ముంబై దాడుల సూత్ర ధారి జమాతె ఉద్ దవా స్థాపకుడు హఫీజ్ సయీద్ మంగళవారం లాహోర్ నుంచి ఇస్లామాబాద్‌కు ‘కశ్మీర్ సద్భావన యాత్ర’ ప్రారంభించాడు. యాత్రను జమ్మూ కశ్మీర్‌కూ పొడిగిస్తామని ప్రతినబూనాడు. మంగళవారం సాయంత్ర ం ఇక్కడ ప్రారంభమైన యాత్ర బుధవారం సాయంత్రం ఇస్లామాబాద్ చేరుకుంటుంది.