సగం పుర్రె తీసి.. కడుపులో దాచిపెట్టేశారు! | half skull of woman removed and preserved in abdomen | Sakshi
Sakshi News home page

సగం పుర్రె తీసి.. కడుపులో దాచిపెట్టేశారు!

Published Thu, Dec 15 2016 1:58 PM | Last Updated on Wed, Sep 26 2018 6:32 PM

సగం పుర్రె తీసి.. కడుపులో దాచిపెట్టేశారు! - Sakshi

సగం పుర్రె తీసి.. కడుపులో దాచిపెట్టేశారు!

రోగుల ప్రాణాలు నిలబెట్టేందుకు వైద్యులు అత్యంత క్లిష్టతరమైన సర్జరీలు సైతం చేస్తారు. ముంబైలో సరిగ్గా ఇలాగే జరిగింది. 21 ఏళ్ల యువతిని కాపాడేందుకు ఆమె పుర్రెలో కొంత భాగాన్ని తీసి.. ఉదరభాగంలో దాచిపెట్టారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని, పుర్రె భాగాన్ని రీకన్‌స్ట్రక్ట్ చేయడానికి ఫిబ్రవరి రెండోవారంలో మరో సర్జరీ చేస్తామని వైద్యులు చెప్పారు. ఈ సర్జరీని 'డీకంప్రెసివ్ సర్కంఫరెన్షియల్ క్రానియెక్టమీ' అంటారు. ఇది అత్యంత అరుదైనది. మెదడులో బాగా వాపు రావడంతో.. దానివల్ల వస్తున్న ఒత్తిడిని తగ్గించేందుకు పుర్రెలో పై సగభాగాన్ని తీసేశారు. వాపు తగ్గిన తర్వాత మళ్లీ దాన్ని అక్కడే అమరుస్తారు. ఇందుకు కొంత సమయం పడుతుంది. 
 
బిహార్‌కు చెందిన ఆ యువతి ఒక ఐపీఎస్ అధికారి కుమార్తె. రెండునెలల క్రితం ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొంది. దాంతో ఆమెకు ట్రమాటిక్ బ్రెయిన్ ఇంజ్యురీ (టీబీఐ) అయ్యింది. ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే ఆమె పరిస్థితి విషమంగా మారిందని వోకార్డ్ ఆస్పత్రిలోని కన్సల్టెంట్ న్యూరో-స్పైన్ సర్జన్ డాక్టర్ అజయ్ బజాజ్ తెలిపారు. గాయం కారణంగా ఆమె మెదడులోని పలు భాగాలలో విపరీతమైన వాపు వచ్చింది. అయితే అదృష్టవశాత్తు రక్తం మాత్రం ఎక్కడా పెద్దగా గడ్డకట్టలేదు. వాపు తగ్గుతుందని వైద్యులు భావించినా, అది తగ్గకపోగా మరింత పెరగసాగింది. దాంతో పుర్రెలో సగభాగాన్ని తీసేశారు. అయితే.. అలా తీసేసిన పుర్రెభాగాన్ని బయట పెడితే అది పాడవుతుంది కాబట్టి దాన్ని ఉదరభాగంలో ఉంచారు. రోగికి వాపు పూర్తిగా నయమైన తర్వాత పుర్రె రీకన్‌స్ట్రక్షన్ మొదలవుతుంది. కృత్రిమ పుర్రె పెట్టే అవకాశం ఉన్నా.. అసలు పుర్రెను యథాతథంగా పెడితే మంచిదని దాన్ని భద్రపరిచామన్నారు. విడిగా 8 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలో ఫ్రిజ్‌లో భద్రపరచొచ్చు గానీ, రోగి కోలుకోడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు కాబట్టి సహజంగానే దాన్ని భద్రపరిచామని డాక్టర్ బజాజ్ వివరించారు. ఫిబ్రవరిలో రెండో సర్జరీ కూడా అయిన తర్వాత ఆమె తిరిగి ఇంటికి వస్తుందని ఆమె తండ్రి చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement