
మంటల్లో దగ్ధమైన మారుతి సుజుకి ఫ్యాక్టరీ..
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ.. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎంఎస్ఐఎల్) ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుర్గావ్ లోని ఇండియా జపాన్ లైటింగ్ ఫ్యాక్టరీ లో మంగళవారంరాత్రి ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో ఫ్యాక్టరీలోని అధిక శాతం దగ్ధమైంది. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది కొన్ని గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
గుర్గావ్ కు 70 కిలోమీటర్ల దూరంలోని రెవారి ప్రాంతంలో నెలకొన్న మారుతి సుజుకి కంపెనీకి చెందిన.. ఐఎంటీ బవాల్ సెక్టర్ 6 లో తీవ్ర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఫ్యాక్టరీనుంచి కొన్ని రకాల ల్యాంప్ లు, ఆటోమొబైల్స్ ఉత్పత్తిచేసి, ఎగుమతి చేస్తుంటారు. అయితే కంపెనీ మొదటి అంతస్తులోని పార్కింగ్ మెటీరియల్స్ ఉంచే ప్రాంతంలో ఉన్నట్లుండి ఎగసి పడిన మంటలతో భారీ ప్రమాదం చోటు చేసుకుందని, ఘటనా సమయంలో కంపెనీలో పనిచేసే సుమారు 500 మంది సిబ్బంది విధుల్లో ఉన్నట్లు యాజమాన్యం తెలిపింది. అయితే మంటలు ఏ కారణంగా సంభవించాయన్నవివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.
ఫ్యాక్టరీలో ఎక్కువగా ప్లాస్టిక్, రబ్బర్ వస్తువులు ఉండటంతో మంటలు కొద్ది నిమిషాల్లోనే ఆ ప్రాంతమంతా వ్యాపించినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. మంటలు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే అంతస్తులోని అన్నివైపులా వ్యాపించడంతో అదుపులోకి తెచ్చేందుకు కొన్ని గంటల సమయం పట్టిందని వారు చెప్పారు. మంటల కారణంగా ఆ ప్రాంతమంతా దట్టంగా పొగ కమ్ముకుందని, బుధవారం ఉదయం వరకూ అదే పరిస్థితి కనిపించిందని కంపెనీ సిబ్బంది ఒకరు తెలిపారు. అయితే అదృష్టవశాత్తు అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఆస్తి నష్టంమాత్రం.. భారీగానే జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.